ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు లంచం కోసం సామాన్య, పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నా కూడా.. పైస ఇవ్వనిదే పని చేయడం లేదు. అదే చేతులు తడిపితే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తూనే ఉన్నారు.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారుల్లో మాత్రం అస్సలు భయం చావడం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఇలాంటిదే ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది.
చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ వేట..
సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఓ భూ సమస్య పరిష్కారం కోసం వచ్చిన బాధితుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన చేర్యాల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి ఆయన రూ.70,000 నగదు లంచం తీసుకుంటుండగా అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
నాగాపురి గ్రామానికి చెందిన ఒక బాధితుడు తన భూమికి సంబంధించిన నాలా కన్వర్షన్ కోసం చాలా రోజులుగా చేర్యాల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మొత్తం 11 నాలా దరఖాస్తులను క్లియర్ చేసి, పని పూర్తి చేయాల్సిందిగా కోరాడు. అయితే ఈ ఫైళ్లు ముందుకు కదలాలంటే తనకు ఏకంగా 70 వేల రూపాయల లంచం ఇవ్వాలని తహసీల్దార్ దిలీప్ నాయక్ డిమాండ్ చేశాడు.
పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ బృందం
లంచం ఇవ్వడం అస్సలు ఇష్టం లేని ఆ బాధితుడు.. నేరుగా మెదక్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందస్తు వ్యూహం పన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో బాధితుడు తహసీల్దార్ కార్యాలయంలోని దిలీప్ నాయక్‌కు రూ. 70,000 నగదును అందిస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఒక్కసారిగా మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
తహసీల్దార్ చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును పూర్తిగా స్వాధీనం చేసుకున్న అధికారులు, తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
