శాస్త్రీయంగా చూస్తే.. ఉదయాన్నే మన మెదడు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. నిద్ర లేచిన కొత్తలో మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ స్థితిలో ఉంటుంది. ఇది పగటి కలలకు, చురుకైన ఆలోచనలకు మధ్య ఉండే ఒక అద్భుతమైన జెన్ మోడ్. ఈ సమయంలో ప్రపంచమంతా నిశబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది కాబట్టి మన సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉదయాన్నే పరుగుల మీద, ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే ఆ ప్రతికూల ప్రభావం రోజంతా ఉండి పనులను దెబ్బతీస్తుంది. అదే ప్రశాంతంగా మొదలుపెడితే, రోజంతా ఎలాంటి సవాలునైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుంది.
తెల్లవారుజామున లేవడం వల్ల ముఖ్యంగా 5 రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. మొదటిది, ఉదయాన్నే పనులు ప్రారంభించడం వల్ల ముఖ్యమైన పనులపై అత్యుత్తమ ఏకాగ్రతను పెట్టవచ్చు. రెండవది, ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారు రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల నాణ్యమైన నిద్ర లభిస్తుంది. మూడవది.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తగ్గి మనశాంతి కలుగుతుంది. నాల్గవది.. ఉదయం త్వరగా లేచేవారు పనులను వాయిదా వేయకుండా ముందే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే క్రమశిక్షణను అలవరచుకుంటారు. చివరగా.. ఆఫీస్ పనుల్లో పడేసరికి మెదడు పూర్తి చురుగ్గా, స్పష్టతతో సిద్ధంగా ఉండటానికి ఈ అలవాటు సహాయపడుతుంది.
ఉదయం 5 గంటలకి లేచాక ఆ మొదటి 60 నిమిషాలను ఎలా ఉపయోగించుకోవాలో రాబిన్ శర్మ 20-20-20 ఫార్ములాను ప్రతిపాదించారు. దీని ప్రకారం మొదటి 20 నిమిషాలు రన్నింగ్ లేదా యోగా వంటి శారీరక వ్యాయామానికి కేటాయించాలి. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తదుపరి 20 నిమిషాలు డైరీ రాయడం లేదా ధ్యానం చేయడం వంటి ఆత్మపరిశీలనకు కేటాయించి, ఆ రోజు సాధించాల్సిన లక్ష్యాలను ఊహించుకోవాలి. చివరి 20 నిమిషాలు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం లేదా ఆడియో బుక్స్ వినడం వంటి జ్ఞానార్జనకు ఉపయోగించాలి. అయితే ఈ సమయాలు వ్యక్తిగత అవసరాలను బట్టి మార్చుకోవచ్చు.
ఒక కొత్త అలవాటు మన జీవితంలో భాగం కావడానికి సగటున 66 రోజులు పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా పట్టుదలతో ప్రయత్నించాలి. ఈ అలవాటు విజయవంతం కావాలంటే రాత్రి 9:30 కల్లా బెడ్ రూమ్‌లో మొబైల్, టీవీ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండి, 10 గంటల కల్లా నిద్రపోవడానికి సిద్ధమవ్వాలి. పగటిపూట కెఫిన్ పరిమితం చేయడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, పడుకునేటప్పుడు గదిలో కాంతి, శబ్దాలు లేకుండా చూసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. కాలక్రమేణా ఈ దినచర్య అలవాటై, ఉదయాన్నే లేవడం ఒక సంతోషకరమైన ప్రక్రియగా మారుతుంది.
కేవలం ఉదయం లేవడమే కాకుండా, జీవితంలో సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే మైండ్‌సెట్, హార్ట్సెట్, హెల్త్సెట్, సోల్సెట్ అనే నాలుగు అంతరంగ సామ్రాజ్యాలపై దృష్టి పెట్టాలని ఈ పుస్తకం సూచిస్తోంది. సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిత్యం ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలను చేరడం సాధ్యమవుతుంది. కాబట్టి అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కే అలవాటును పక్కన పెట్టి ఈ వారం నుంచే ఉదయం 5 గంటల క్లబ్లో చేరి మీ జీవితాన్ని ఒక సరికొత్త విజయతీరానికి నడిపించండి.





