తాజావార్తలు

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!


E20 Petrol: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol-blended petrol) వాడకాన్ని వేగంగా పెంచుతోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న E20 పెట్రోల్, పాత వాహనదారుల్లో కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై వాహనదారుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ E20 పెట్రోల్‌ను నిరంతరం వాడటం వల్ల ఇంజన్ గానీ, ఫ్యూయల్‌ సిస్టమ్‌ల్‌ కొన్ని భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

ARAI అధ్యయనం నాలుగు చక్రాల వాహనాల్లో ఇంజిన్ మన్నికను కూడా పరిశీలించింది. నివేదిక ప్రకారం ఒక భారత్ స్టేజ్-IV (BS-IV) ఇంజిన్ పనితీరు E20 ఇంధనంతో ఆమోదయోగ్యంగా ఉంది. అయితే, 265 గంటల మన్నిక తర్వాత BS-VI టర్బో ఛార్జ్డ్ ఇంజిన్‌లో సమస్య గమనించారు.

ఇంజిన్ మన్నిక మదింపులో భాగంగా ఇద్దరు ప్యాసింజర్ వాహన తయారీదారులు పరీక్షలు నిర్వహించారు. ఒక ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ (OEM) విషయంలో 400 గంటల పరీక్ష తర్వాత ఎటువంటి సమస్యలూ గమనించబడలేదు. అలాగే E20 ఇంధనంతో ఇంజిన్ పనితీరు ఆమోదయోగ్యంగా ఉంది. అయితే రెండవ OEM విషయంలో మొత్తం 809 గంటల పాటు పరీక్షించిన ఇంజిన్‌లో ఎగ్జాస్ట్ వాల్వ్ థర్మోమెకానికల్ వైఫల్యం గమనించారు.

ఇవి కూడా చదవండి



ఏయే భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది?

ఇథనాల్‌కు ఒక ప్రత్యేకమైన లక్షణ ఉంది. ఇది రబ్బరు, కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలను త్వరగా క్షీణింపజేస్తుంది (Corrosive nature). నివేదికల ప్రకారం E10 వాహనాల్లో E20 పెట్రోల్ వాడితే ఈ కింది సమస్యలు రావచ్చు.

  1. రబ్బరు భాగాలు దెబ్బతినడం: ఫ్యూయల్ లైన్లు (ఇంధన పైపులు), రబ్బరు హోస్‌లు, ఫ్యూయల్ పంప్‌లో ఉండే రబ్బరు సీల్స్ ఇథనాల్ ప్రభావానికి గురై మెత్తగా మారిపోవడం లేదా పగుళ్లు రావడం జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.
  2. ఇంధన లీకేజీలు: రబ్బరు సీల్స్ దెబ్బతినడం వల్ల ఫ్యూయల్ సిస్టమ్ నుండి పెట్రోల్ లీక్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
  3. మెటల్ భాగాల తుప్పు: ఇథనాల్ గాల్లోని తేమను (నీటిని) ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంధన ట్యాంక్ లోపలి భాగాలు, మెటల్ పైపులు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది.
  4. గమనిక: 2023 ఏప్రిల్ తర్వాత మార్కెట్లోకి వచ్చిన దాదాపు అన్ని కొత్త కార్లు, బైకులు ‘E20 Material Compliant’తో వస్తున్నాయి. అంటే వాటిలోని రబ్బరు, మెటల్ భాగాలు 20% ఇథనాల్‌ను తట్టుకునేలా తయారుచేశారు. అందుకే కొత్త వాహనదారులకు ఎలాంటి సమస్య ఉండదు. కేవలం అంతకంటే ముందు వచ్చిన పాత వాహనదారులే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాహనదారులు ఏం చేయాలి?

  1. యూజర్ మాన్యువల్ తనిఖీ చేయండి: మీ వాహనం ఏ రకమైన ఇంధనానికి (E10 లేదా E20) సపోర్ట్ చేస్తుందో మీ బండి మాన్యువల్ లేదా ఫ్యూయల్ క్యాప్ (ట్యాంక్ మూత) పై ఉన్న స్టిక్కర్ ద్వారా తెలుసుకోండి.
  2. రెగ్యులర్ సర్వీసింగ్: మీది పాత వాహనం అయితే, సర్వీసింగ్ చేయించేటప్పుడు ఫ్యూయల్ పైపులు, రబ్బరు హోస్‌లు క్షేమంగా ఉన్నాయో లేదో ఒకసారి మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవడం మంచిది.

అయితే E20 పెట్రోల్‌ వల్ల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీని గురించి వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *