ఇటీవల కాలంలో వివిధ ఆర్ధిక అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువ మంది కలిగి ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసే సొమ్ముపై కూడా బ్యాంకులు వడ్డీని అందిస్తూ ఉంటాయి. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని జమ చేస్తూ ఉంటాయి. మీ బ్యాంకు స్టేట్మెంట్లో దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది.
అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ల ద్వారా వచ్చే వడ్డీని కూడా పొందుపర్చాలి. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే.. అన్ని అకౌంట్లపై వచ్చిన వడ్డీ వివరాలను అందించాలి. ఒకవేళ ఈ డీటైల్స్ ఇవ్వకపోయినా లేదా తప్పుడు సమాచారం అందించినా చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది. భారీగా జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంటుంది.
ఐటీ నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీ 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం'గా పరిగణిస్తారు. దీంతో ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. దీనిని మీ మొత్తం వార్షిక ఆదాయానికి జోడించి మీ పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే పలు మినహాయింపుల కోసం క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఈ మేరకు ఐటీ శాఖ అవకాశం కల్పిస్తోంది.
సెక్షన్ 80TTA కింద 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు రూ. 10 వేల వరకు క్లెయిమ్ పొందే అవకాశముంది. ఇక సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80TTB కింద రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఈ తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త డిఫాల్ట్ పన్ను విధానంలో ఈ మినహాయింపు అందుబాటులో లేదు.
ITRలో మోసపూరితమైన బ్యాంకు వడ్డీ మినహాయింపులను క్లెయిమ్ చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 270A ప్రకారం మీరు చెల్లించాల్సిన పన్నుపై 200 శాతం జరిమానాతో పాటు 24 శాతం వార్షిక వడ్డీ రేటును కూడా చెల్లించవలసి ఉంటుంది. మూడు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు.





