తాజావార్తలు

సూపర్‌మార్కెట్ల పై సైబర్‌ దాడి.. పాడైన ఆహారం, కోట్లలో నష్టం!


ఫ్రాన్స్‌లోని ఇంటర్‌మార్షే (Intermarché), కోఆపరేటివ్‌ యూ (Cooperative U), ఈ లెక్లెర్క్‌ (E.Leclerc), క్యారీఫోర్‌ (Carrefour), మోనోప్రి (Monoprix) సూపర్‌మార్కెట్లపై సైబర్‌ దాడి జరిగింది. హ్యాకర్లు దుకాణాల్లోని శీతలీకరణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని, ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను పెంచేసారు. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ కు పెరగడంతో పాలు, మాంసం, తాజా ఆహార పదార్థాలతో పాటు ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన ఆహారం పాడైంది. ఇంటర్‌మార్షే నెట్టో (Netto) బ్రాండ్‌కు చెందిన కనీసం 300 దుకాణాలు దాడి బారినపడ్డాయి. కోఆపరేటివ్‌ యూకు చెందిన వందకు పైగా అవుట్‌లెట్లపై ప్రభావం పడింది. క్యారీఫోర్‌ సంస్థకు చెందిన 80 సూపర్‌మార్కెట్లు. 490 దుకాణాలు ఉన్న మోనోప్రి సంస్థ సైబర్‌ దాడి బారినపడ్డాయి. ఈ లెక్లెర్క్‌కు చెందిన కొన్ని దుకాణాలు కూడా ప్రభావితమైనట్లు సమాచారం.

ఒక్క రోజులో కోట్లాది యూరోల నష్టం!

ఈ సైబర్‌ దాడి వల్ల దేశవ్యాప్తంగా ఒక్క రోజులో నష్టం కోట్లాది యూరోలు అని అంచనా వేశారు. రిటైల్‌ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై ఇంకా ప్రభుత్వం స్పష్టమైన అంచనాకు రాలేదు . అనేక దుకాణాల్లోని శీతలీకరణ వ్యవస్థలను హ్యాకర్లు రిమోట్‌గా నియంత్రించి, బలవంతంగా డీఫ్రాస్టింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా ఫ్రిజ్‌లలో పేరుకుపోయే మంచును తొలగించేందుకు డీఫ్రాస్టింగ్‌ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయడం వల్ల శీతలీకరణ వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి.

డెన్మార్క్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణమా?

దేశీయ సైబర్‌ భద్రతా సంస్థ ఏఎన్‌ఎస్ఎస్ఐ (ANSSI) ను విచారణ చేపట్టాలని ఫ్రాన్స్‌ ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్నూ ఆదేశించారు. డెన్మార్క్‌కు చెందిన డాన్‌ఫాస్‌ (Danfoss) సంస్థ సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపం ఈ దాడికి కారణమై ఉండవచ్చని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై డాన్‌ఫాస్‌ స్పందిస్తూ.. ఫ్రాన్స్‌లో ప్రభావితమైన కొన్ని శీతలీకరణ వ్యవస్థల్లో పాత వెర్షన్లు పనిచేస్తున్నాయని, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, పాత పరికరాలను మార్చాలని వినియోగదారులకు గతంలోనే సూచించినట్లు తెలిపింది. ఈ సైబర్‌ దాడులు ఫ్రాన్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. స్పెయిన్‌, పోర్చుగల్‌, పోలాండ్‌, జర్మనీ, బెల్జియం దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఇతర యూరోపియన్‌ దేశాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అంచనా వేస్తోంది.

ఫ్రిజ్‌లతో మొదలై ఆస్పత్రులు, విద్యుత్‌ వ్యవస్థల వరకు వెళ్తుందా?

ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాలను హ్యాక్‌ చేయగలిగితే, వాటి కార్యకలాపాలను రిమోట్ గా నియంత్రించే అవకాశం ఉంటుందని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనను యూరప్ దేశాలు అప్రమత్తం కావాల్సిన హెచ్చరికగా సైబర్‌ భద్రతా విశ్లేషకుడు స్టీవెన్‌ లాచాన్స్‌ అభివర్ణించారు. ప్రస్తుతం సూపర్‌మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు  భవిష్యత్తులో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు, ఆస్పత్రులు వంటి కీలక రంగాలపై దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల భద్రతను బలోపేతం చేయడం, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, దేశాల మధ్య సైబర్‌ భద్రతా సహకారాన్ని పెంచడం అత్యవసరమని సూచించారు. ఫ్రాన్స్‌లో వందలాది సూపర్‌ మార్కెట్లను ప్రభావితం చేసిన ఈ ఘటన.. డిజిటల్‌ సాంకేతికతపై ఆధారపడుతున్న వ్యాపార సంస్థలకు సైబర్‌ భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *