తాజావార్తలు

Cyclone Murasu: తీరం దాటుతున్న మురసు తుపాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు..


మురసు తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. తీరం దాటే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 9 కిమీ వేగంతో తుపాన్ క‌దులుతోంది. ప్రస్తుతం ఒంగోలుకు 20 కిమీ, బాపట్ల60 కిమీ, కావలికు 70 కిమీ, నెల్లూరుకు 110కిమీ, మచిలీపట్నంకు 130కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ వాఖ తెలిపింది. తీరం దాటిన నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. పశ్చిమ గోదావరి , ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

చీరాల, బాపట్ల, ఒంగోలు తీర ప్రాంతాల్లో ఉప్పెన రావొచ్చని హెచ్చరించింది వాతావరణశాఖ. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, వాడరేవు హార్బర్‌లో 10, మచిలీపట్నంలో 9, కృష్ణపట్నంలో 8వ నెంబర్ వార్నింగ్స్‌ ఇచ్చారు. విశాఖ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, కళింగపట్నంలో 3వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్‌ కారణంగా 15 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ అధికారులు. దక్షిణకోస్తా, రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాముందన్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. మురసు తుఫాను కారణంగా 20 అడుగులు సముద్రం ముందుకు వచ్చింది. కొత్తపట్నం మండలం పల్లెపాలెంలోనూ సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. సముద్రం ఒడ్డు కోతకు గురౌతోంది. బీచ్‌కు వెళ్లే దారిని పడవలు అడ్డం పెట్టి మూసేశారు.

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో బొబ్బిలంక–మిర్తిపాడు వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది.

మురసు తుఫాన్‌పై ప్రకాశం జిల్లా ప్రజల్ని అలర్ట్ చేశారు మంత్రి గొట్టిపాటి రవి. అద్దంకి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై అధికారులకు సమాచారం ఇవ్వాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు దగ్గర ఉండొద్దని సూచించారు. తెగిపడిన వైర్లను తాకవద్దన్నారు మంత్రి గొట్టిపాటి.

తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *