తాజావార్తలు

56 కి.మీ దూరం నుంచి రోబోతో ఆపరేషన్.. అమెరికాలో భారత సంతతి డాక్టర్ సంచలనం!


అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ విపుల్ పటేల్ గ్లోబల్ రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 66 ఏళ్ల మార్క్ అనే వ్యక్తికి ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్థారణ అయింది. ఆయన ఈ వినూత్న రోబోటిక్ శస్త్రచికిత్సకు సంబంధించిన క్లినికల్ రీసెర్చ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ ఆపరేషన్ కోసం రోగిని ఫ్లోరిడాలోని అడ్వెంట్‌హెల్త్ ఆసుపత్రిలో ఉంచారు. మరోవైపు డాక్టర్ విపుల్ పటేల్ వేరే ఆసుపత్రిలో ఉండి ఆపరేషన్ నిర్వహించారు. ఈ రెండు ఆసుపత్రుల మధ్య దూరం 56 కిలోమీటర్లు. రోగి దగ్గరికి వెళ్లకుండానే రోబోటిక్ వ్యవస్థను నియంత్రిస్తూ క్యాన్సర్ సోకిన ప్రోస్టేట్ గ్రంథిని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకుంటున్నారు.

రోబోను ఎలా నియంత్రించారు?

ఈ శస్త్రచికిత్సలో మైక్రోపోర్ట్ మెడ్‌బాట్ (MicroPort MedBot) రూపొందించిన ప్రత్యేక రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఉపయోగించారు. సాధారణంగా రోబోటిక్ సర్జరీలో వైద్యుడు రోగి ఉన్న ఆసుపత్రిలోనే ఉంటారు. రోబో చేతులను నియంత్రిస్తూ ఆపరేషన్ చేస్తారు. అయితే టెలిరోబోటిక్ సర్జరీలో వైద్యుడు మరో ప్రాంతంలో ఉండి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ద్వారా రోబోను నియంత్రిస్తారు. డాక్టర్ విపుల్ పటేల్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా రోబోటిక్ పరికరాలను నడిపించారు. రోగి ఉన్న ఆసుపత్రిలో మరో సర్జన్ డాక్టర్ మార్సియో మోస్కోవాస్ ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి అవసరమైన సహాయాన్ని అందించారు.

21 వేలకుపైగా రోబోటిక్ సర్జరీలు

డాక్టర్ విపుల్ పటేల్‌కు రోబోటిక్ సర్జరీల్లో అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు 21 వేలకు పైగా రోబోటిక్ ప్రోస్టెక్టమీ ఆపరేషన్లు నిర్వహించారు. ఇప్పుడు రిమోట్ టెలిరోబోటిక్ సర్జరీ ద్వారా మరో ఘనత సాధించారు. ఈ ప్రయోగం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతించిన పరిశోధనాత్మక వైద్య అధ్యయనంలో భాగంగా జరిగింది. ఈ విధానం సురక్షితంగా ఉందా? ఎంత సమర్థంగా పనిచేస్తుంది? సాంకేతికంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే అంశాలను పరిశోధకులు పరిశీలించారు.

Indian American Doctor Vipul Patel Performs Telerobotic Surgery From 56 Km Away In Us

Indian American Doctor Vipul Patel Performs Telerobotic Surgery From 56 Km Away In Us

వైద్యరంగంలో కొత్త శకం

శస్త్రచికిత్సల రంగంలో కొత్త శకానికి నాంది పలకవచ్చని ఆపరేషన్ విజయవంతమైన తర్వాత డాక్టర్ విపుల్ పటేల్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండటం చాలాసార్లు రోగి నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో టెలిరోబోటిక్ సర్జరీ ద్వారా దూర ప్రాంతాల్లో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది.

అమెరికాలోనే తొలి ప్రయత్నం

ఇప్పటికే అమెరికాలోని ఓర్లాండో నుంచి అంగోలాలోని లువాండా వరకు 10 పరిశోధనాత్మక టెలిసర్జరీలు నిర్వహించినట్లు అడ్వెంట్‌హెల్త్ తెలిపింది. అయితే రెండు వేర్వేరు ఆసుపత్రుల మధ్య పూర్తిగా అమెరికాలోనే నిర్వహించిన తొలి ప్రయత్నం ఇదేనని పేర్కొంది.
వైద్యుల నైపుణ్యానికి రోబోటిక్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ తోడైతే భవిష్యత్తులో వైద్య సేవల రూపమే మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో నివసించే రోగులకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *