Afghanistan: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకుంది. వన్డే క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకు. మరోవైపు భారత జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు ఏడో స్థానానికి మించి ముందుకు వెళ్లని ఆ జట్టు.. తాజాగా శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ఖాతాలో 2,926 పాయింట్లు, 94 రేటింగ్ ఉన్నాయి. శ్రీలంక కూడా 94 రేటింగ్‌తో ఉన్నప్పటికీ 4,144 పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది.
అగ్రస్థానంలో భారత్.. రెండో స్థానంలో న్యూజిలాండ్
ఈ జాబితాలో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీమిండియా 4,122 పాయింట్లు, 115 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3,809 పాయింట్లు, 109 రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 3,547 పాయింట్లు, 104 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు 104 రేటింగ్, ఆస్ట్రేలియాకు 102 రేటింగ్ ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్లు తొలి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
17 ఏళ్లలో అద్భుత ప్రస్థానం
ఆఫ్ఘనిస్థాన్ 2009లో తొలిసారిగా వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి 17 ఏళ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో బలమైన జట్టుగా ఎదిగింది. వన్డేలతో పాటు టీ20 క్రికెట్‌లోనూ తన సత్తా చాటుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించి సంచలనం సృష్టించింది.2024 టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయాలు ఆ జట్టు ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచాయి.
191 వన్డేల్లో 96 విజయాలు
ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటివరకు ఆడిన 191 వన్డేల్లో 96 విజయాలు సాధించింది. ఆ జట్టు గెలుపు, ఓటముల నిష్పత్తి 1.09గా ఉంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి జట్లను ఇప్పటికే వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్థాన్.. తాజాగా శ్రీలంకను కూడా అధిగమించింది.
ఇటీవలి సిరీస్‌లలోనూ అదరగొట్టింది
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఆఫ్ఘనిస్థాన్ 4-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడలేదు. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ తన అత్యుత్తమ స్థానాన్ని అందుకుంది.
ఐసీసీ వన్డే టీం ర్యాంకింగ్స్ – టాప్ 10
1. భారత్ – 115 రేటింగ్
2. న్యూజిలాండ్ – 109
3. దక్షిణాఫ్రికా – 104
4. పాకిస్థాన్ – 104
5. ఆస్ట్రేలియా – 102
6. అఫ్గానిస్థాన్ – 94
7. శ్రీలంక – 94
8. ఇంగ్లండ్ – 93
9. బంగ్లాదేశ్ – 81
10. వెస్టిండీస్ – 79
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
