తాజావార్తలు

రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!


చిన్న వ్యాపారంలో ఎంత సంపాదిస్తారులే అనుకుంటున్నారా? అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌లో మ్యాగీ అమ్ముతున్న ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే ఆఫ్ సీజన్‌లోనూ రోజుకు రూ.14 వేల వ్యాపారం చేస్తున్నాడు. అతడి సంపాదన తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పర్వత ప్రాంతాలకు ట్రెక్కింగ్‌ కు వెళ్లడం ట్రెండ్‌ గా మారింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో చిన్న చిన్న మ్యాగీ స్టాళ్లు కనిపిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో ప్లేట్ మ్యాగీ, వేడివేడి టీ తాగితే ఆ మజాయే వేరు. ఇలాంటి చిన్న వ్యాపారాల వెనుక ఎంత కష్టం ఉంటుందో చాలా మందికి తెలియదనీ కంటెంట్ క్రియేటర్ హర్ష్ చౌహాన్ చెప్పాడు. తన పోస్ట్‌ తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌లో మ్యాగీ అమ్ముతున్న ఓ వ్యక్తి సంపాదన పై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఆఫ్ సీజన్‌లోనూ రోజుకు రూ.14 వేల వ్యాపారం!

కంటెంట్ క్రియేటర్ హర్ష్ చౌహాన్ రోహ్‌తంగ్ పాస్ కు ట్రెక్కింగ్‌ కు వెళ్లాడు. మ్యాగీ స్టాల్ నిర్వహిస్తున్న స్థానిక వ్యక్తిని కలిశాడు. రోజువారీ సంపాదన అడిగి తెలుసుకోగా పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్‌ కాకుండా, రద్దీ తక్కువగా ఉండే ఆఫ్ సీజన్‌లో కూడా తన వ్యాపారం బాగానే సాగుతుందని ఆ వ్యక్తి చెప్పాడు. రోజుకు సుమారు రూ.14 వేల అమ్మకాలు జరుగుతున్నట్లు వెల్లడించడంతో హర్ష్ చౌహాన్ ఆశ్చర్యపోయాడు. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చిన్న మ్యాగీ స్టాల్ ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

సంపాదన వెనుక బోలెడు కష్టం

అయితే రోజుకు రూ.14 వేల వ్యాపారం జరుగుతోందని మాత్రమే చూసి ఆ వ్యక్తి అంతా లాభంగా సంపాదిస్తున్నాడని భావించకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోహ్‌తంగ్ పాస్ వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహించడం అంత సులభం కాదు.
అక్కడి తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణం, సరుకులను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు, రోజంతా నిలబడి పనిచేయాల్సిన పరిస్థితులు ఇలాంటి ఎన్నో సవాళ్లు ఉంటాయి. మ్యాగీ, పాలు, టీ ఇతర సామగ్రిని అక్కడికి చేరవేయడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.ఏ వ్యాపారమైనా చిన్నదని తక్కువగా చూడకూడదని, కష్టపడి పనిచేస్తే చిన్న స్టాల్ ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చని కామెంట్లు చేస్తున్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *