తాజావార్తలు

బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..

బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..


బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..

మన చుట్టూ ఉన్న అనేక జీవుల నుంచి మనం ప్రయోజనాలు పొందుతూ ఉంటాం. వాటిలో బల్లి కూడా ఒకటి. కొందరికి భయాన్ని, మరికొందరికి శకునాలను గుర్తుచేసే బల్లులు నిజానికి మన జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, మన ఇంట్లో బల్లులు లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. బల్లులతో వచ్చే ప్రధాన ప్రయోజనం కీటక నియంత్రణ. మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేని ప్రపంచాన్ని ఊహించలేం, కానీ అవి మరీ ఎక్కువైనా పరిస్థితులు భయానకంగా మారతాయి. ఇక్కడ జీవ సమతుల్యతను కాపాడటంలో బల్లులు కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రుళ్లు ఎక్కువగా తిరిగే దోమలు, ఈగలు, పురుగులు, ఇతర కీటకాలను బల్లులు ఆహారంగా తీసుకుని వాటి జనాభాను నియంత్రిస్తాయి. ఆ తర్వాత ఈ బల్లులను పక్షులు తింటాయి. ఈ విధంగా అవి జీవ వైవిధ్యానికి, ఆహారపు గొలుసు ముందుకు సాగడంలో తోడ్పడతాయి.

సాధారణంగా మన ఇళ్లల్లో హౌస్, గార్డెన్, ట్రీ లిజర్డ్స్ అనే రకాల బల్లులు కనిపిస్తాయి. వీటిలో మరిన్ని రకాలు ఉండవచ్చు. వాటిపై పరిశోధనలు జరిగి ప్రజలకు అవగాహన కల్పించాలి. బల్లులు విషపూరితమైనవనే అపోహ చాలామందిలో ఉంది. అవి ఎదురైతే మంచిది కాదని, అపశకునమని భావిస్తారు. అలాగే ఆహారంలో బల్లి పడితే అది విషపూరితం అవుతుందని నమ్ముతారు. అయితే, ఇవన్నీ అపోహలేనని పరిశోధనలు ధ్రువీకరించాయి. బల్లుల్లో మనుషులను చంపేంత విషం ఉండదు. బల్లి పడిన ఆహారం తీసుకున్నప్పుడు వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినా, అవి సాధారణంగా అలర్జీ వల్ల వస్తాయి. మందులతో ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఈ విషయంపై మరింత లోతైన పరిశోధనలు అవసరం. గతంలో మన ఇళ్ల చుట్టూ చిన్న తోటలు, మొక్కలు, చెట్లు ఎక్కువగా ఉండేవి. అక్కడ కీటకాలు వచ్చి వాటిని తినడానికి బల్లులు, ఉడుములు వచ్చేవి. రాత్రి పూట బల్లులు, పగటి పూట ఉడుములు కీటకాలను తినేవి. ఇప్పుడు చెట్లు, తోటలు తగ్గిపోవడం వల్ల ఉడుములు, బల్లులు అంతరించిపోతున్నాయి. ఒకవేళ బల్లులే లేకపోతే, కీటకాల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీని వల్ల దోమలు పెరిగి, కొత్త రకాల ఇన్ఫెక్షన్లు మనల్ని చుట్టుముడతాయి. కీటకాలను హతమార్చడానికి మనం రసాయన కీటక నాశనులను ఉపయోగించాల్సి వస్తుంది. అవి మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. బల్లులు ఈ కీటకాలను సహజసిద్ధంగా, సమర్థవంతంగా నియంత్రించగలవు. కాబట్టి బల్లులు లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయి. బల్లుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి మనుగడకు అనుకూలమైన వాతావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత.

Also Read: కొత్తిమీర ఇంటి వద్ద కట్టలు కట్టలుగా రావాలంటే ఇలా చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *