తాజావార్తలు

చైనా విడిభాగాలతో.. సొంతంగా క్షిపణుల తయారీలో హౌతీలు .. ఇజ్రాయెల్‌, సౌదీ పై గురి!


మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ ఆయుధ సంపత్తిని పెంచుతున్నారు. ఇప్పటివరకు ఇరాన్ ఆయుధాలు, సాంకేతిక సహాయంపై ఆధారపడిన ఈ గ్రూప్.. ఇప్పుడు క్షిపణులు, డ్రోన్ల విడిభాగాలను సేకరించి సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే ప్రయత్నాల్లో ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్, బ్లూమ్‌బెర్గ్ పరిశోధనాత్మక కథనాలు తెలిపాయి.

చైనా నుంచి విడిభాగాలు ..నాలుగు కంటైనర్లలో ఏమున్నాయి?

ఏడెన్ ఓడరేవులో అధికారులు నాలుగు షిప్పింగ్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి బయలుదేరిన ఈ సరుకు.. హౌతీల నియంత్రణలో ఉన్న ఎర్ర సముద్ర తీరంలోని హొదైదా ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఆ కంటైనర్లలో అనుమానాస్పద క్షిపణి విడిభాగాలు, డ్రోన్లకు సంబంధించిన పరికరాలు,  సొరంగాలు తవ్వేందుకు ఉపయోగించే పరికరాలను గుర్తించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్లో ఉపయోగించే భాగాలను పోలిన భాగాలు అందులో ఉన్నాయి. క్షిపణులు అధిక వేడిని తట్టుకునే రక్షణ కవచాలను తయారు చేయడానికి ఉపయోగపడే ఫినోలిక్ రెసిన్ అనే పదార్థం ఉన్నట్లు తెలిసింది.

ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు ?

హౌతీలు ఇలాంటి విడిభాగాలతో అధునాతన బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయగలిగితే.. వారి దాడుల పరిధి పెరుగుతుంది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు వినియోగంలోకి వస్తే సౌదీ అరేబియాలోని సుదూర లక్ష్యాలపై దాడులు చేసే అవకాశం ఉంది. సాధారణ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో పోలిస్తే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు ఎక్కువ బరువున్న పేలోడ్‌లను మోసుకెళ్లగలవు. దిశను మార్చుకుంటూ ప్రయాణించే సామర్థ్యం ఉన్న క్షిపణులను అడ్డుకోవడం ఇతర దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు కష్టం కానుంది. హౌతీల ఆయుధ తయారీ కేంద్రాలు అత్యంత రహస్యంగా ఉండటంతో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా ఉందని CAR సీనియర్ విశ్లేషకుడు ఫాబియన్ హింజ్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.

41 రవాణా పత్రాలు.. మారిన దిగుమతిదారుల పేర్లు

ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశాన్ని బ్లూమ్‌బెర్గ్ వెలుగులోకి తెచ్చింది. చైనా ఎగుమతిదారుల నుంచి హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు సరుకులు చేరవేసేందుకు విస్తృతమైన వాణిజ్య నెట్‌వర్క్ పనిచేస్తుందనీ,  షిప్పింగ్ రికార్డుల పరిశీలనలో 41 బిల్ ఆఫ్ లేడింగ్ పత్రాల కింద డజన్ల కొద్దీ కంటైనర్లు తరలినట్లు గుర్తించారు. బిల్ ఆఫ్ లేడింగ్ అనేది సరుకు రవాణాకు సంబంధించిన ముఖ్యమైన పత్రం. ఇందులో సరుకు వివరాలు, పంపినవారు, స్వీకరించేవారికి సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఈ 41 రవాణా పత్రాల్లో 25 సందర్భాల్లో.. సరుకు ప్రయాణంలో ఉండగానే యెమెన్‌లోని దిగుమతిదారుల పేర్లను మార్చినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. హౌతీలతో సంబంధం ఉన్న కంపెనీల అసలు వివరాలు బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద క్షిపణి భాగాలు, డ్రోన్ పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, తయారీ యంత్రాలు ఒకే సరుకు నెట్‌వర్క్‌లో కనిపించడం నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్‌పై ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నమా?

హౌతీలు గత కొన్నేళ్లుగా ఇరాన్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మద్దతుతో తమ ఆయుధ సంపత్తిని విస్తరించుకున్నారు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో విడదీసిన రూపంలో ఇరాన్ క్షిపణులను దిగుమతి చేసుకుని, యెమెన్‌లో వాటిని తిరిగి అమర్చడంపై ఎక్కువగా ఆధారపడ్డారు. 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఈ విధానంలో మార్పు కనిపించింది. పూర్తిస్థాయి ఆయుధాల కంటే విడిభాగాలను ఎక్కువగా సేకరించి, వాటితో ఆయుధాలను అమర్చడం లేదా ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.

ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు, యంత్రాలను సేకరించే ప్రయత్నాలు కూడా అదే వ్యూహంలో భాగమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. హౌతీలు తమ సరఫరా మార్గాలను విస్తరించడంతో పాటు ఆయుధాల వినియోగంలో అనుభవాన్ని పెంచుకున్నారు. క్షిపణులు, డ్రోన్ల సాఫ్ట్‌వేర్‌లో కృత్రిమ మేధ (AI)ను కూడా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. హౌతీలు ఇరాన్ ఆయుధాల సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, యెమెన్‌లోనే క్షిపణులు, డ్రోన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *