పీఎం కిసాన్ నిధులు ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి శుభవార్త. దసరా, దీపావళి లాంటి వరుస పండుగల క్రమంలో ఈ నెలలోనే ఏ క్షణమైనా రైతుల బ్యాంక్ ఖాతాల్లో 24వ విడత సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 23వ విడతను విడుదల చేసి నాలుగు నెలలు కావొస్తున్న క్రమంలో.. తర్వాతి విడతను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం.
నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఇప్పటికే సూపర్ ఎల్నివో ప్రభావంతో రైతులు పంట సాగుకు దూరం కావడం, దసరాతో పాటు దీపావళి వరుస పండుగల క్రమంలో త్వరలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం ఎప్పటినుంచో అమలవుతుండగా.. ఇప్పటివరకు కేంద్రం రూ.4.47 లక్షల కోట్లు లబ్దిదారులకు అందించింది.
ఈ ఏడాది జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ 23వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది లబ్దిదారులకు రూ.18,880 కోట్లు రిలీజ్ చేశారు. ఇందులో 2.8 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. డిసెంబర్ 1,2018 నుంచి ఈ పథకం అమలవుతోంది. ప్రతీ ఏడాది ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.6 వేల చొప్పున అందిస్తున్నారు.
రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి చొప్పున విడుదల చేస్తున్నారు. జూన్ 20న 23వ విడత అందించగా.. అక్టోబర్ 20తో నాలుగు నెలలు కావొస్తుంది. దీంతో ఈ నెలలో రైతులకు తర్వాతి విడత రూ.2 వేలు జమ చేసే ఛాన్స్ ఉంది.
అయితే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. ల్యాండ్ డేటా సీడింగ్ అయి ఉండాలి. ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇవన్నీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నగదు అకౌంట్లో నేరుగా జమ అవుతాయి. ఈ పనులు పెండింగ్లో ఉంటే నిధులు నిలిచిపోతాయి.





