తాజావార్తలు

రెండు గంటల్లో రూ. 24 వేల బిజినెస్.. ఐడియా మామూలుగా లేదుగా!


ఓ సెలబ్రిటీ కాన్సర్ట్‌ జరుగుతుందంటే వేలాది మంది అభిమానులు తరలివస్తారు. తమ అభిమాన గాయకుడి పాటలను ఆస్వాదిస్తూ సందడి చేస్తారు. కానీ అదే జనసందోహాన్ని ఓ వ్యక్తి తనకు వచ్చిన వ్యాపార అవకాశంగా మార్చుకున్నాడు. ఎలాంటి షాపు లేదు.. ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయలేదు.. పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. కేవలం రెండు గంటల్లో రూ.24 వేల అమ్మకాలు చేశాడు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఢిల్లీలో నిర్వహించిన సంగీత కచేరీ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కచేరీకి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అక్కడ మంచి వ్యాపార అవకాశం ఉందని ఓ వ్యక్తి గుర్తించాడు. అంతే.. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే జనాల మధ్య తిరుగుతూ తన వ్యాపారాన్ని కొనసాగించాడు.

రూ.13 బాటిల్.. రూ.50కి అమ్మకం!

ఈ వ్యక్తి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నాడు. ఒక్కో వాటర్ బాటిల్‌ను రూ.13 చొప్పున కొనుగోలు చేసి వాటిని కచేరీకి వచ్చిన అభిమానులకు ఒక్కోటి రూ.50కు విక్రయించాడు. అంటే ఒక్కో బాటిల్‌పై రూ.37 వ్యత్యాసం వచ్చింది.అతడు కేవలం ఒకటి, రెండు బాటిళ్లు అమ్మి ఆగిపోలేదు. ఏకంగా రెండు గంటల్లో 480 వాటర్ బాటిళ్లను విక్రయించాడు. ఈ లెక్కన మొత్తం అమ్మకాలు రూ.24,000కు చేరాయి. అంటే గంటకు సుమారు రూ.12 వేల అమ్మకాలు అన్నమాట! ఒక చిన్న ఆలోచనతో ఇంత తక్కువ సమయంలో ఇన్ని బాటిళ్లు అమ్మడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఐడియాకు ఫిదా.. ధరపై భిన్నాభిప్రాయాలు!

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వేలాది మంది ఒకే చోట చేరినప్పుడు వారికి ఏది ఎక్కువగా అవసరమో గుర్తించడం కూడా ఒక వ్యాపార నైపుణ్యమేనని కొందరు అన్నారు. పెద్దగా పెట్టుబడి పెట్టకుండా, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. అయితే అందరి స్పందన ఒకేలా లేదు. రూ.13కు కొనుగోలు చేసిన వాటర్ బాటిల్‌ను రూ.50కి విక్రయించడంపై కొందరు ప్రశ్నిస్తున్నారు. జనాల అవసరాన్ని గుర్తించి వ్యాపారం చేయడం వేరు.. అదే అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధర వసూలు చేయడం వేరంటూ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా దిల్జిత్ కచేరీలోని జనసందోహాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకున్న వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఒక్కోసారి పెద్ద వ్యాపారానికి పెద్ద షాపు, భారీ పెట్టుబడులు అవసరం లేదని. సరైన సమయంలో సరైన అవకాశాన్ని గుర్తిస్తే చాలని ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *