ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ స్మార్ట్‌ఫోన్ ఒక నిత్యావసరంగా మారింది. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం గడపడం కూడా కష్టంగా మారిన ఈ తరుణంలో, మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సయ్యద్ హమీద్ అనే వ్యక్తి కనీసం కీప్యాడ్ సెల్‌ఫోన్ కూడా వాడకుండా తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. వందలాది దొంగతనాలు చేసి పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన ఇతడిని చివరకు మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హమీద్ తన బతుకుతెరువు కోసం ఎక్కడా స్థిరంగా ఉండకుండా వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవాడు. నిత్యం పనికోసం తిరిగే ఈ వ్యక్తి ఫోన్ వాడకపోవడం, అతని అనుమానాస్పద కదలికలు కేసు దర్యాప్తులో ఉన్న పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. అదుపులోకి తీసుకుని విచారించగా, అతని నో ఫోన్ నినాదం వెనుక ఉన్న అసలు నిజం బయటపడింది. సాంకేతికతను ఉపయోగించి చిటికెలో కేసులను ఛేదించే పోలీసులకు, మొబైల్ సిగ్నల్స్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులకు చిక్కకుండా వందల కొద్దీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు.
ఇతని మోసపు పద్ధతి సాధారణమైనది కాదు. పగటి పూట తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా రెచ్చిపోయేవాడు. దొంగతనానికి బయలుదేరితే ఒకేసారి రెండు ఇళ్లను కొల్లగొట్టడం ఇతని స్టైల్. ఇతనిపై ఏకంగా 130కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. రెండుసార్లు పీడీ యాక్ట్ కింద జైలు జీవితం అనుభవించినా, అతడి తీరులో మార్పు రాలేదు. 2019లో నాచారం పోలీసులు, 2023లో సరూర్‌నగర్ పోలీసులు ఇతడిని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించారు. అయినప్పటికీ, జైలు నుంచి విడుదలైన వారానికే మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గత నెల 19న మైలార్ దేవ్ పల్లి పరిధిలోని లక్ష్మీగూడలో శ్రావణ్ కుమార్ అనే వ్యాపారి ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, 40 తులాల వెండి మాయమైంది. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే రాజేంద్రనగర్ పరిధిలో మరో చోరీ జరిగింది. పట్టపగలే జరిగిన ఈ జంటచోరీలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, సయ్యద్ హమీద్ అనే పాత నేరస్తుడిగా గుర్తించారు. హమీద్‌ను పట్టుకునేందుకు అతని కుటుంబసభ్యులు, పరిచయస్తులపై నిఘా పెట్టి, పక్కా సమాచారంతో హైదరాబాద్‌లోని వాంబే కాలనీ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో, హమీద్ జనగాం జైలు నుంచి విడుదలైన వెంటనే హైదరాబాద్‌కు వచ్చి నేరాలకు పాల్పడినట్లు తేలింది. హైదరాబాద్‌లో రెండు చోరీల అనంతరం నిజామాబాద్‌లో రెండు, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రైలులో రెండు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. హమీద్ నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండితో పాటు నేరాలకు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని భార్య చోరీలకు మూడు రోజుల ముందే నాందేడ్‌కు వెళ్లిపోయినట్లు కూడా గుర్తించారు. ఈ అరెస్ట్ అనంతరం నిందితుడిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) ఆర్డర్స్ తీసుకొని ఏడాది పాటు జైలులో ఉంచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎంత తెలివైన దొంగైనా తప్పు చేస్తే ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదన్నడానికి ఈ ఘటనే నిదర్శనం అని పోలీసులు స్పష్టం చేశారు.
