తాజావార్తలు

గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!


అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన రాచెల్ అపా (24) చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్న యువతి. బక్నెల్ యూనివర్సిటీలో హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. యూనివర్సిటీ జట్టు తరఫున 17 గోల్స్ చేసింది.

రాచెల్‌కు న్యూయార్క్ సిటీ మారథాన్‌లో పాల్గొనాలనే కోరిక కలిగింది. ఇందుకోసం కొన్ని నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంది. మొత్తం 26.2 మైళ్లు అంటే సుమారు 42.2 కిలోమీటర్లు పరుగెత్తేందుకు సిద్ధమైంది. ఆదివారం జరిగిన మారథాన్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. మొదట్లో ఉత్సాహంగా పరుగెత్తింది. కానీ 24వ మైలు సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. సెంట్రల్ పార్క్ వద్ద కుప్పకూలిపోయింది. అప్పటికి గమ్యస్థానానికి చేరుకోవడానికి మరో రెండు మైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

‘ఔచ్.. ఔచ్’ అంటూ తండ్రికి మెసేజ్

మారథాన్‌లో పాల్గొంటున్న కుమార్తెను ప్రోత్సహించేందుకు ఆమె తల్లి మిచెల్ అపా న్యూయార్క్‌ వెళ్లారు. తండ్రి స్టీవ్ అపా పెన్సిల్వేనియాలోని ఇంటి నుంచే మారథాన్ ట్రాకింగ్ యాప్ ద్వారా కుమార్తె పరుగును గమనిస్తున్నారు.14వ మైలు వద్ద రాచెల్ ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ పరుగెత్తుతున్న దృశ్యాలను ఆమె తల్లి వీడియో తీశారు. అయితే ఆ తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది. 18వ మైలు వద్ద ఉన్నప్పుడు తండ్రికి ‘ఔచ్’ అంటూ మెసేజ్ పంపించింది. మరో మైలు దాటిన తర్వాత ‘ఔచ్.. ఔచ్’ అంటూ మరో సందేశం పంపింది. దీంతో కుమార్తెకు నొప్పులు మొదలయ్యాయని తండ్రి గుర్తించారు. వెంటనే నెమ్మదిగా పరుగెత్తాలని, మరీ ఎక్కువగా శ్రమించవద్దని సూచించారు. 23వ మైలు చేరుకున్నప్పుడు ‘ఇక చివరి దశలో ఉన్నావు.. గమ్యం దగ్గర్లోనే ఉంది’ అంటూ ప్రోత్సహించారు. కానీ ఆ తర్వాత రాచెల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇంతలో 25వ మైలు వద్ద కుమార్తె కోసం ఎదురుచూస్తున్న తల్లికి ట్రాకింగ్ యాప్‌లో రాచెల్ కదలికలు ఆగిపోయినట్లు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే కుమార్తె చివరిగా కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే రాచెల్‌ను అంబులెన్స్‌లో మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

ఏడు నిమిషాల ఆలస్యంపై ఆందోళన

రాచెల్ కుప్పకూలిన వెంటనే అక్కడున్న ప్రేక్షకులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. వారిలో మైఖేలా నికోలస్ అనే సోషల్ వర్కర్ సీపీఆర్ (CPR) చేసారు. అనంతరం మారథాన్ వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని డీఫిబ్రిలేటర్ ఉపయోగించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే వైద్య సిబ్బంది చేరుకోవడానికి కనీసం ఏడు నిమిషాలు పట్టిందని మైఖేలా తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఏడు నిమిషాల ఆలస్యం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు రాచెల్‌ను కాపాడేందుకు ఆరు గంటలకు పైగా శ్రమించారు అయినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి 9.40 గంటలకు ఆమె మరణించింది.

ఏంటి రాబ్డోమయోలిసిస్? ఎందుకు ప్రమాదకరం?

రాచెల్ మరణానికి రాబ్డోమయోలిసిస్ (Rhabdomyolysis) అనే అరుదైన పరిస్థితి కారణమని వైద్యులు తెలిపారు.
రాబ్డోమయోలిసిస్‌ను సంక్షిప్తంగా ‘రాబ్డో’ అని పిలుస్తారు. తీవ్ర శారీరక శ్రమతో కండరాలు గాయపడతాయి. కండరాల కణజాలం దెబ్బతిని విచ్ఛిన్నమవుతుంది. కండరాల్లోని కొన్ని పదార్థాలు రక్తంలోకి విడుదలవుతాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కండరాలు దెబ్బతిన్న కొన్ని గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో క్రియేటిన్ కైనేజ్ (CK) స్థాయిని పరీక్షించడం ద్వారా ఈ సమస్యను గుర్తిస్తారు. సాధారణం కంటే ఎక్కువగా కండరాల నొప్పులు, తిమ్మిర్లు రావడం, టీ  రంగులో మూత్రం, నీరసం, అలసట, కండరాలు బలహీనంగా మారడం లక్షణాలు.

తాత జ్ఞాపకార్థం పరుగెత్తిన యువతి

పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడిన తన తాత జ్ఞాపకార్థం, ఈ వ్యాధిపై అవగాహన పెంచడానికి, బాధితులకు నిధుల సేకరణ కోసం రాచెల్ మారథాన్ లో పాల్గొంది.  2022లో ఆమె తాత మరణించారు. చిన్నతనం నుంచి తాతే తనకు ఆదర్శమని రాచెల్ గతంలో చెప్పింది. చురుగ్గా ఉండటం, పరిమితులను అధిగమించి కొత్త సవాళ్లను స్వీకరించడం ఆయన నుంచే నేర్చుకున్నట్లు తెలిపింది. పార్కిన్సన్స్ ఫౌండేషన్ కోసం 4,000 డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆమె మరణవార్త తెలిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు విరాళాలు అందించడంతో ఆ లక్ష్యాన్ని మించిన నిధులు సమకూరాయి. రాచెల్ 2024లో బక్నెల్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తూనే చార్లెస్టన్ సదరన్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సులో చేరింది.

మారథాన్ నిర్వాహకుల సంతాపం

రాచెల్ మృతిపై న్యూయార్క్ రోడ్ రన్నర్స్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, రన్నింగ్ కమ్యూనిటీకి సంతాపం తెలిపింది. తాత జ్ఞాపకార్థం మారథాన్‌లో పాల్గొన్న రాచెల్ జీవితం ఫినిషింగ్ లైన్‌కు రెండు మైళ్ల దూరంలో ముగియడం ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *