తాజావార్తలు

బాదంతో బరాబర్.. ఫుల్లుగా విటమిన్లు, ప్రోటీన్లు.. రోజూ గుప్పెడు తింటే బ్రెయిన్ కత్తిలా మారుతుంది..


మన వంటకాల్లో వేరుశనగలు (పల్లీలు) సాధారణంగా వాడే పదార్థమే అయినప్పటికీ, వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్నే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పల్లీలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పల్లీల్లోని పోషకాలు – ఆరోగ్య లాభాలు:

పోషకాల నిధి:

బాదం పప్పులకు సమానమైన పోషకాలు పల్లీలలో లభిస్తాయి. అందుకే పల్లీలను పేదవారి బాదం అని పిలుస్తారు. తక్కువ ధరకు బాదం పప్పులో ఉండే పోషకాలు ప్రొటీన్లు, విటమిన్లు పల్లీల్లో కూడా లభిస్తాయి.. బాదం పప్పుతో సమానమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు ఇందులో ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో పల్లీలు చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

పల్లీల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫోలేట్ మరియు ‘అర్జినైన్’ అనే అమైనో ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి.

గుండెకు రక్షణ: పల్లీలు తీసుకోవడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో గ్లైసెమిక్ నియంత్రణకు ఇవి తోడ్పడతాయి.

మెదడు ఆరోగ్యంపై పల్లీల ప్రభావం

నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజూ పల్లీలు తినడం వల్ల వృద్ధులలో మెదడు పనితీరు మెరుగవుతుందని తేలింది. 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల 31 మందిపై 16 వారాల పాటు ఈ పరిశోధన జరిపారు. ప్రతిరోజూ 60 గ్రాముల వేరుశనగలు తిన్నవారిలో సెరిబ్రల్ రక్త ప్రసరణ (Cerebral Blood Flow) 3.6 శాతం పెరిగినట్లు, వెర్బల్ మెమరీ పనితీరు 5.8 శాతం మెరుగైనట్లు గుర్తించారు. పల్లీలలోని అసంతృప్త కొవ్వులు, పీచు పదార్థం, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ నాడీ కణాల మధ్య అనుసంధానాన్ని పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల అల్జీమర్స్ వంటి సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది.

పల్లీలను ఏ విధంగా తినాలి?

వేరుశనగలతో లాభాలున్నాయి కదా అని నూనెలో వేయించినవి, ఉప్పు లేదా కారం కలిపిన పల్లీలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులు క్యాలరీలు పెరుగుతాయి.

ఎటువంటి ఉప్పు కలపకుండా, తొక్కతీసి వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల మెదడుకు పూర్తి ప్రయోజనం దక్కుతుంది.

అంతేకాకుండా.. నానాబెట్టిన పల్లీలను గుప్పెడు తీసుకోవడం చాలా మంచిది.

పల్లీలతో పాటు రోజూ శారీరక శ్రమ చేయడం, పజిల్స్ పూరించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి అలవాట్లు ఉంటే మెదడు మరింత చురుగ్గా మారుతుంది.

అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *