తాజావార్తలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌.. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా?


ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేలబోతున్నాయ్.. రీపోలింగ్‌ జరిగిన బూత్‌లతో పాటు..రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాల విడుదల 8 గంటలకు మొదలవుతుంది.. అయితే ఈవీఎం కౌంటింగ్‌తో పోలిస్తే బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. కౌంటింగ్‌ నుంచి ఫలితం అనౌన్స్ చేసే వరకూ మొత్తం ఐదు ఫేజ్‌లు ఉంటాయి.. ఫేజ్‌-1లో సాధారణ బ్యాలట్‌ పత్రాల లెక్కించే ముందు పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. చెల్లుబాటయ్యే పోస్టల్‌ ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కించి, ఫలితాలను రిజల్ట్‌ షీట్‌లో నమోదు చేసి ప్రకటిస్తారు. ఆ తర్వాత బ్యాలట్‌ బాక్స్‌లు తెరిచి, అందులోని బ్యాలట్‌ పత్రాలను వేరు చేస్తారు. మేయర్‌ లేదా ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు సంబంధించిన బ్యాలట్‌ పత్రాలు గులాబీ రంగులో, వార్డు సభ్యుల బ్యాలట్‌ పత్రాలు తెలుపు రంగులో ఉంటాయి. వీటిని రంగుల ఆధారంగా వేర్వేరుగా విభజిస్తారు. ఆపై ప్రతి 25 బ్యాలట్‌ పత్రాలను ఒక కట్టగా కట్టి, వాటి సంఖ్యను పోలింగ్‌ కేంద్రాల లెక్కలతో సరిపోల్చుకుంటారు. 25 కంటే తక్కువ పత్రాలు మిగిలితే వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తారు.

బ్యాలట్‌ పత్రాలను 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఫేజ్‌-2లో వాటిని మేయర్‌, ఛైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్‌లలో వేస్తారు. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ బ్యాలట్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వద్దకు, వార్డు సభ్యుల బ్యాలట్‌ పత్రాలను సంబంధిత కౌంటింగ్‌ టేబుళ్ల వద్దకు తరలిస్తారు. అనంతరం ఎలాంటి పత్రాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రమ్‌లలోని బ్యాలట్‌ కట్టలను పూర్తిగా కలుపుతారు. ఈ సమయంలో అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తారు.

డ్రమ్‌లలోని బ్యాలట్‌ పత్రాల కట్టల నుంచి ఫేజ్‌-3లో ర్యాండమ్‌గా 40 కట్టలను బయటకు తీస్తారు. అంటే ఒక్కో రౌండ్‌లో వెయ్యి బ్యాలట్‌ పత్రాలను లెక్కిస్తారు. మేయర్‌, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు వేర్వేరుగా జరుగుతుంది. తొలుత చెల్లని బ్యాలట్‌ పత్రాలను గుర్తించి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లను అభ్యర్థుల వారీగా వర్గీకరిస్తారు. ఇలా డ్రమ్‌లోని బ్యాలట్‌ పత్రాలన్నీ పూర్తయ్యే వరకు రౌండ్ల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌ ఫలితాలను ప్రకటిస్తారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫేజ్‌-4అభ్యర్థుల వారీగా వేరు చేసిన బ్యాలట్‌ పత్రాలను 50 చొప్పున కట్టలుగా కడతారు. వీటన్నింటినీ పెద్ద బండిల్‌గా ఏర్పాటు చేసి, ఓట్ల సంఖ్య వివరాలు ఉన్న కాగితాన్ని జతచేసి భద్రపరుస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లతో పాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా రిజల్ట్‌ షీట్‌లో నమోదు చేస్తారు. పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలను రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా వెల్లడిస్తారు.

ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడించిన తర్వాత ఫేజ్‌-5లో రీకౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఫలితాలు ప్రకటించిన అనంతరం కొద్దిసేపు వేచి చూసి.. రీకౌంటింగ్‌ కోరుకునే అభ్యర్థులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకునేందుకు 15 నిమిషాల సమయం ఇస్తారు. రీకౌంటింగ్‌ కోరడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి భావిస్తే.. మళ్లీ లెక్కింపునకు ఆదేశిస్తారు. ఈ ప్రక్రియలో పోస్టల్‌ బ్యాలట్‌లతో సహా అన్ని ఓట్లను తిరిగి లెక్కిస్తారు. అనంతరం తుది ఫలితాలను ప్రకటిస్తారు.

బ్యాలట్‌ పత్రంపై ఓటరు ఎవరో తెలిసేలా రాతలు లేదా ప్రత్యేక గుర్తులు ఉన్నా.. అభ్యర్థి గుర్తు దగ్గర కాకుండా వేరే చోట ఓటు వేసినా.. నిర్దేశించిన ప్రత్యేక ముద్రకు బదులుగా వేరే ముద్రను ఉపయోగించినా ఆ ఓటును చెల్లనిదిగా పరిగణిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా, ఓటు ఎవరికి వేశారో స్పష్టంగా తెలియకపోయినా తిరస్కరిస్తారు. అంతేకాదు.. పోలింగ్‌ అధికారి సంతకం లేదా గుర్తింపు ముద్ర లేని బ్యాలట్‌ పత్రాలను కూడా తిరస్కరిస్తారు. ఇలా తిరస్కరించిన ప్రతి బ్యాలట్‌ పత్రంపై రిజెక్టెడ్‌ అని రాసి రిటర్నింగ్‌ అధికారి సంతకం చేసి, అభ్యర్థికి, ఏజెంట్‌కు చూపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *