మంగళూరు, నవంబర్ 24: కర్ణాటకలోని మంగళూరులో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ మెడికల్ కాలేజీ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని వేరే మతానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉండటమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణాలు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాలేజీ క్యాంపస్‌లో ఏం జరిగింది?
మంగళూరులోని కనచూర్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు కాలేజీ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థిని వద్దకు రావడం కనిపిస్తోంది. అనంతరం ఆమెను బలవంతంగా పట్టుకుని ఓ వాహనం వైపు లాక్కెళ్లారు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వాహనంలోకి నెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. థార్ ఎస్‌యూవీగా గుర్తించిన ఆ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
విద్యార్థిని వేరే మతానికి చెందిన యువకుడితో సంబంధంలో ఉండటంపై కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై కనచూర్ మెడికల్ కాలేజీ డీన్ షానవాజ్ మణిప్పాడి స్పందించారు. విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని, ఆమె ప్రతిఘటించడంతో అక్కడున్న వారికి అది కిడ్నాప్లా కనిపించిందని పేర్కొన్నారు. ఆ సమయంలో కాలేజీ యాజమాన్యం వారిని ఆపలేకపోయిందని తెలిపారు. ఈ ఘటనపై మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యార్థిని ఆచూకీ గుర్తించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థిని ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
A medical student was allegedly abducted in broad daylight from Kanachur Medical College in Mangaluru. video shows a group forcibly dragging her into an SUV. The alleged motive? Her relationship with a Hindu man. https://t.co/WRqVKcwEgU
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 20, 2026
మేజర్‌కు తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థిని మేజర్ అని, ఆమె ఎక్కడ ఉండాలి? ఎవరితో కలిసి జీవించాలి? అనే విషయాలను నిర్ణయించుకునే చట్టబద్ధమైన హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశారు. ఒక వయోజన మహిళను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకెళ్లడం నేరమని పేర్కొన్నారు. ఇందులో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వ్యక్తిగత విభేదాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళూరులోని మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థిని ఆచూకీ, ఆమె ఇష్టాయిష్టాలు, ఘటన వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
