సులభంగా జీర్ణమయ్యే చికెన్: తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ కోరుకునే వారికి స్కిన్లెస్ చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను తక్కువ కేలరీలతో అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మటన్‌తో పోలిస్తే చికెన్ శరీరానికి సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే జింక్, ప్రోటీన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా చికెన్ ఎంతో మేలు చేస్తుంది.
పోషకాల గని మటన్: మరోవైపు మటన్ శరీరానికి అవసరమైన విభిన్న రకాల ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులో హై-క్వాలిటీ ప్రొటీన్‌తో పాటు ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇమ్యూనిటీని బలపరుస్తాయి. అయితే చికెన్‌తో పోలిస్తే మటన్‌లో కొవ్వు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కొంతమందిలో కడుపు నొప్పి, గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
గుండె సమస్యలు ఉన్నవారు: మటన్‌లో ఉండే సంతృప్త కొవ్వుల కారణంగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు దీనిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు మటన్‌ను వీలైనంత మితంగా తీసుకోవడం మంచిది. ఒకవేళ ప్రోటీన్ మాత్రమే కావాలనుకుంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. అదే సమయంలో శరీరంలో రక్తం తక్కువగా ఉండి, ఐరన్, విటమిన్ బి12 అవసరమైన వారు వైద్యుల సలహా మేరకు మటన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.
ఈ కాలంలో ఏది తిన్నా ఇదే ముఖ్యం: అయితే వర్షాకాలంలో చికెన్ లేదా మటన్.. వీటిలో ఏది మంచిదనే చర్చ కంటే మనం తినే మాంసం ఎంత శుభ్రంగా ఉందనేది అత్యంత కీలకం. ఎందుకంటే ఈ సీజన్లో సరిగ్గా ఉడకని మాంసం తింటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎల్లప్పుడూ నమ్మకమైన, పరిశుభ్రమైన దుకాణాల నుండి మాత్రమే తాజా మాంసాన్ని కొనుగోలు చేయాలి. అలాగే మాంసాన్ని వండేటప్పుడు బాగా ఉడికించి వేడిగా ఉన్నప్పుడే తినడం అలవాటు చేసుకోవాలి.
ఏది బెస్ట్?: వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి పొట్టకు భారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే చికెన్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే.. మితంగా, జీర్ణమయ్యేలా మసాలాలు తగ్గించి వండుకోవాలి. ఏది తిన్నా సరే.. రోడ్డు పక్కన నిల్వ ఉంచిన నాన్‌వెజ్ పదార్థాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తింటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.





