తాజావార్తలు

Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..

Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..


ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ విధ్వంసానికి తోడు బౌలర్ల ధాటికి ఢిల్లీ కకావికలమైంది. ఫలితంగా ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 9000 పరుగుల మైలురాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ, ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ఈ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 8 సెంచరీలు, 66 అర్ధ సెంచరీలతో కోహ్లీ తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. 2026 సీజన్‌లో కోహ్లీ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 54.66 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు.

బౌలర్ల స్వింగ్ మాయాజాలం.. ఢిల్లీ విలవిల

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్‌సీబీ పేస్ ద్వయం జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించారు. వారి స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఢిల్లీ బ్యాటర్లు క్యూ కట్టారు. కేవలం 13 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ వెన్ను విరిచారు.

సిక్సర్లతో ముగించిన కోహ్లీ

76 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. టి నటరాజన్ బౌలింగ్‌లో కోహ్లీ వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను స్టైలిష్‌గా ఫినిష్ చేశాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ, అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ కంటే కేవలం ఒక పాయింట్ వెనుకబడి ఉంది.

ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే తర్వాత అత్యల్ప స్కోర్లు:

  • 13/6 – DC vs RCB (న్యూ ఢిల్లీ, 2026)
  • 14/2 – RR vs RCB (కేప్ టౌన్, 2009)
  • 14/3 – SRH vs RR (పుణె, 2022)
  • 15/2 – CSK vs KKR (కోల్‌కతా, 2011)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *