తాజావార్తలు

Telangana: రాత్రికి రాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు


రాత్రికిరాత్రే చేనులోని చేతికొచ్చిన పత్తిని ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లే.. బాధిత రైతు బ్రహ్మనంద రెడ్డికి మద్దికుంట గ్రామ శివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆయన ఎంతో ఆశతో పత్తి పంటను సాగు చేశారు. ఈ ఏడాది పత్తి పంట బాగా పండటంతో, ఇటీవల వచ్చిన దసరా పండుగ రోజున చేను వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పంటను తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరిగింది.

శనివారం రాత్రి పూట ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు, బ్రహ్మనంద రెడ్డి పత్తి చేనుపై పడ్డారు. ఒకే రాత్రిలో ఏకంగా సుమారు 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకుని, వాహనాల్లో లోడ్ చేసుకుని పరారయ్యారు.ఉదయం అలవాటు ప్రకారం పొలానికి వెళ్లిన రైతు బ్రహ్మనంద రెడ్డి, అక్కడ చేను పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తెల్లగా మెరిసిపోవాల్సిన పత్తి మొక్కలన్నీ బోసిపోయి కనిపించడంతో ఆయన గుండె పగిలింది. మూడెకరాల తోటలో దొంగలు పడి పత్తిని దోచుకెళ్లడంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాత పొలం గట్టుపైనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించారు.

లక్షల్లో పెట్టుబడి పెట్టి, అప్పులు తెచ్చి సాగు చేస్తే.. ఇప్పుడు చేతికొచ్చిన పంట దొంగల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతన్న. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తికి మంచి ధర పలుకుతుండటమే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని బాధిత రైతు, స్థానికులు అనుమానిస్తున్నారు. తెల్లబంగారానికి ఉన్న డిమాండ్‌ను చూసి, ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే దొంగలు రాత్రి వేళల్లో పొలాలపై పడి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అంటున్నారు.

ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో పత్తిని దొంగిలించారంటే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్‌తో, వాహనాలతో వచ్చిన ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాధిత రైతు బ్రహ్మనంద రెడ్డిని ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని, అలాగే రాత్రి వేళల్లో పొలాల వైపు పోలీసు గస్తీ పెంచి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మద్దికుంట పరిసర గ్రామాల రైతులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *