మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలో ఉన్న షెండా పార్క్, ఫుయె కడీ కొండ ప్రాంతాలు అరుదైన జీవవైవిధ్యానికి వేదికగా నిలిచాయి. ఇక్కడి గడ్డి భూముల్లో పరిశోధకులు ఒక విభిన్నమైన ట్రాప్డోర్ సాలీడు జాతిని కనుగొన్నారు. ఈ ప్రాంతం గౌరవార్థం దీనికి టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్ అని నామకరణం చేశారు. సాధారణ సాలీళ్లలా ఇవి గూళ్లు అల్లవు; తమ జీవితకాలమంతా నేల అడుగున సుమారు 100 సెంటీమీటర్ల పొడవు ఉండే బొరియల్లోనే గడుపుతాయి. ఈ బొరియలు సాలీడు పరిమాణానికి అనుగుణంగా వెడల్పు అవుతూ, అది స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా నిర్మించుకుంటాయి.
ఈ సాలీళ్ల ప్రత్యేకత ఏమిటంటే, తమ నివాసానికి మట్టి, ఆకులు, కొమ్మలతో కలిపి ఒక రహస్య తలుపును ఏర్పాటు చేసుకోవడం. ఇది పరిసరాలతో కలిసిపోయి ఉండటం వల్ల శత్రువుల కంటపడదు. వీటి వేట పద్ధతి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది; బొరియ తలుపు వద్ద ఏదైనా ఎర కదలికలను పసిగట్టిన వెంటనే, హఠాత్తుగా బయటకు వచ్చి ఎరను లోపలికి లాక్కుంటాయి. ఈ సాలీళ్ల దీర్ఘాయువు కూడా ఆశ్చర్యకరమే. ఒక అధ్యయనం ప్రకారం ఆడ ట్రాప్డోర్ సాలీళ్లు గరిష్టంగా 43 ఏళ్ల వరకు జీవించగలవు, కానీ మగ సాలీళ్ల ఆయుష్షు మాత్రం తక్కువగా ఉంటుంది. శివాజీ యూనివర్సిటీ, థాకరే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ సంయుక్తంగా చేసిన ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో ప్రచురితమయ్యాయి. అయితే, పెరుగుతున్న నిర్మాణ పనులు, ఇతర మొక్కల సాగు వల్ల వీటి ఆవాసాలు దెబ్బతింటున్నాయని, వీటిని రక్షించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు.. వేటాడి చంపేస్తాయ్
పొలానికి వెళ్లిన రైతుకు తుప్పల్లో ఏవో కనిపించాయ్.. అవి ఏంటా అని వెళ్లి చూడగా
