
కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లూ కలిసుందామనుకున్న ఇద్దరు ప్రేమికులు, చిన్నపాటి మనస్పర్థలతో ఒకరి వెనుక మరొకరు ఆత్మహత్య చేసుకొని లోకాన్ని విడిచివెళ్లారు. ఈ ఘటనతో చెన్నూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు గ్రామానికి చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, సోమవారం యోగేంద్ర పుట్టిన రోజు కావడంతో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది.. అదే క్రమంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యోగేంద్ర.. సోమవారం తన పుట్టిన రోజునాడే కడపలోని తన బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఇక ప్రియుడి మరణవార్త తెలుసుకున్న హేమశ్రీ కూడా చెన్నూరులోని తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చేతికొచ్చిన కొడుకు మరణంతో అటు యువకుడి కుటుంబంలో, పెళ్లీడుకొచ్చిన కూతురి మరణంతో ఇటు అమ్మాయి ఇంట్లో విషాదచాయులు అలుముకున్నాయి.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న చెన్నూరు, కడప పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. అసలు వారి మధ్య గొడవకు కారణమేంటి? క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమేనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
