ప్రస్తుతం చాలామంది కేవలం షుగర్ వ్యాధి వచ్చినప్పుడో, లేదా బరువు తగ్గాలనుకున్నప్పుడు మాత్రమే జొన్న రొట్టెలను తింటున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా జొన్నలను రోజూ తీసుకోవడం ఎంతో మంచిది.
జొన్నలు పోషకాల గని. మన శరీరానికి ప్రతిరోజూ కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.
జొన్నల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్, పీచు పదార్థం, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్‌ని అరికట్టి దీర్ఘకాలిక రోగాల నుండి రక్షిస్తాయి.
మన శరీర జీవక్రియలకు అవసరమైన సోడియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. జొన్నలు డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరప్రసాదం. వీటిలో ఉండే ఎంజైములు పిండి పదార్థాలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలు సరైన ఎంపిక. వీటిలో ఉండే అధిక పీచు, ప్రొటీన్ల కారణంగా కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును నివారించి బరువు పెరగకుండా చూస్తుంది. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్: రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. జొన్నల్లో ఉండే లిపిడ్లు, పాలీకోసనాల్లు, ఫైటో స్టెరాళ్లు శరీరంలో కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సహకరించి, చెడు కొవ్వులను బయటకు పంపుతాయి. జొన్నల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఇవి మనల్ని కాపాడతాయి.
క్యాన్సర్ నిరోధకం: జొన్నల్లో ఉండే పోషకాలు శరీరంలో అనియంత్రితంగా పెరిగే క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకోవడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను పక్కన పెట్టి, జొన్నల వంటి చిరుధాన్యాలను మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అత్యవసరం.






