తాజావార్తలు

Rohit Sharma: పరుగులు చేయకపోయిన మ్యాచ్‎ను గెలిపించింది మాత్రం రోహితే


Rohit Sharma: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. కైల్ జేమీసన్ బౌలింగ్‌లో పరుగులు ఏమీ తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్‌లో మాత్రం జట్టుకు కీలకంగా మారాడు. ముఖ్యంగా డారిల్ మిచెల్‌ను రనౌట్ చేసిన తీరు మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రోహిత్ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

రోహిత్ రనౌట్‌తో మారిన మ్యాచ్ పరిస్థితి

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఈ కీలక ఘటన చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన బంతిని గ్లెన్ ఫిలిప్స్ లెగ్ సైడ్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్, ఫిలిప్స్ మధ్య సమన్వయం కుదరలేదు. ఈ గందరగోళాన్ని రోహిత్ శర్మ వెంటనే గుర్తించాడు. బంతిని అందుకున్న అతడు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వైపు అండర్ ఆర్మ్ త్రో విసిరాడు. రాహుల్ వేగంగా బెయిల్స్ పడగొట్టడంతో క్రీజు బయట ఉన్న మిచెల్ రనౌట్ అయ్యాడు. అప్పటికే ప్రమాదకరంగా మారుతున్న మిచెల్, ఫిలిప్స్ భాగస్వామ్యానికి దీంతో తెరపడింది.

రోహిత్ రనౌట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్

మ్యాచ్ తర్వాత శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. భారత బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాడు. ముఖ్యంగా రోహిత్ చేసిన రనౌట్ మ్యాచ్ ను మార్చిందని అభిప్రాయపడ్డాడు. మిచెల్, ఫిలిప్స్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతోందని, భారత్‌లోనూ వీరిద్దరూ మంచి బ్యాటింగ్ చేశారని గుర్తుచేశాడు. అలాంటి సమయంలో రోహిత్ చురుకైన ఫీల్డింగ్‌తో కీలక వికెట్ అందించాడని ప్రశంసించాడు. అందుకే సున్నా పరుగులకే ఔటైనా రోహిత్‌కు గిల్ గెలుపు క్రెడిట్ ఇచ్చాడు.

కాంబోజ్ బౌలింగ్‌పై కెప్టెన్ ప్రశంసలు

ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అన్షుల్ కాంబోజ్‌ను కూడా గిల్ అభినందించాడు. ఇలాంటి పిచ్‌లపై కాంబోజ్ బౌలింగ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు. అతడు వేగంగా బంతులు వేయడంతో పాటు సీమ్ కదలికను రాబట్టగలడని వివరించాడు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించని సమయంలోనూ అదనపు బౌన్స్ రాబట్టడం అతడి ప్రత్యేకతగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కాంబోజ్ 10 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడి పొదుపైన బౌలింగ్ న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకమైంది.

కోహ్లీ హాఫ్ సెంచరీతో భారత్‌కు విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. టిమ్ సీఫర్ట్ 38, గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులు చేశారు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టుకు కొంత ఊరటనిచ్చాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు, గుర్నూర్ బ్రార్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశారు. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేయగా, గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరకు భారత్ 22.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *