తాజావార్తలు

IPL 2026 : అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్.. పర్పుల్ క్యాప్ రేసులో మాత్రం తనదే హవా

IPL 2026 : అభిషేక్‎ను  వెనక్కి నెట్టి  ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్.. పర్పుల్ క్యాప్ రేసులో మాత్రం తనదే హవా


IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో జట్ల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత రికార్డుల వేట కూడా అంతే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బ్యాటర్ల సత్తాను చాటే ఆరెంజ్ క్యాప్, బౌలర్ల ప్రతాపాన్ని చూపే పర్పుల్ క్యాప్ రేసు ప్రతి మ్యాచ్‌కూ మలుపులు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 48వ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ హోల్డర్ మారిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన పోరుకు ముందు వరకు ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వద్ద ఉండేది. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అవి అతడిని పరుగుల రేసులో అగ్రస్థానానికి చేర్చాయి. ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ 10 మ్యాచ్‌లలో 445 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలవగా, అభిషేక్ శర్మ 440 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. కేవలం 5 పరుగుల స్వల్ప తేడాతో రాహుల్ ఆరెంజ్ క్యాప్‌ను తన శిరస్సుపై అలంకరించుకున్నాడు.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. 13 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో స్థిరంగా పరుగులు సాధిస్తూ వస్తుండటంతో, ఆ స్వల్ప పరుగులే అతడిని ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలబెట్టాయి. అభిషేక్ శర్మ ఇంకా తన తర్వాతి మ్యాచ్ ఆడాల్సి ఉంది, కాబట్టి ఈ రేసు రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.

బౌలింగ్ విభాగంలో సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్‌తో రారాజుగా కొనసాగుతున్నాడు. భువీ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్‌కు భువనేశ్వర్‌ను అధిగమించే గొప్ప అవకాశం దక్కింది. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు కంబోజ్ ఖాతాలో కూడా 17 వికెట్లు ఉన్నాయి. కానీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కంటే మెరుగైన ఎకానమీ, యావరేజ్ ఉండటంతో భువీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కంబోజ్ ఒక్క వికెట్ తీసినా పర్పుల్ క్యాప్ అతడి సొంతం అయ్యేది.

కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్షుల్ కంబోజ్ దారుణంగా విఫలమయ్యాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 49 పరుగులు ధారపోసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి వికెట్ల సంఖ్య 17 వద్దే నిలిచిపోయింది. భువనేశ్వర్ కుమార్ 15.52 యావరేజ్‌తో ఉండగా, కంబోజ్ యావరేజ్ 18.70 కి పెరిగింది. దీనివల్ల భువీ తన పర్పుల్ క్యాప్‌ను సురక్షితంగా నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ ముగిసేలోపు మరిన్ని వికెట్లు తీసి ఈ క్యాప్ అందుకోవాలని కంబోజ్ పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *