తాజావార్తలు

WITT Summit 2026: ‘భారత్–ప్రపంచం’ అజెండాకు మోదీ దిశానిర్దేశం

WITT Summit 2026: ‘భారత్–ప్రపంచం’ అజెండాకు మోదీ దిశానిర్దేశం


WITT Summit 2026: ‘భారత్–ప్రపంచం’ అజెండాకు మోదీ దిశానిర్దేశం

దేశానికి ప్రాధాన్యతనిచ్చే ప్రముఖ ఆలోచన వేదికగా పేరొందిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026 నాల్గవ సంచికతో మరింత ఘనంగా ముందుకు వస్తోంది. ఈ సమ్మిట్ మార్చి 23, 24 తేదీల్లో దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. మూడోసారి వరుసగా ఈ సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రధాని, ఈ వేదిక ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దేశంలోని కీలక సమస్యలు, అవకాశాలపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపే వేదికగా ఇది గుర్తింపు పొందుతోంది.

‘ఇండియా & ది వరల్డ్’ అనే అంశంతో నిర్వహించనున్న ఈ సమ్మిట్, ఆర్థిక ఆకాంక్షలు, రాజకీయ పరిణామాలు, సాంకేతిక మార్పులు, సామాజిక ఆలోచనల మధ్య భారత్ ఎదుగుదల దిశను విశ్లేషించనుంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అవసరమైన మార్గదర్శకాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఆలోచనకర్తలు, వ్యాపార నేతలు, సామాజిక వేత్తలు ఒకే వేదికపై చర్చించనున్నారు. గత ఎడిషిన్‌లో ‘కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్’ అనే అంశంపై చర్చలు జరగగా, ఈసారి 2047 నాటికి భారత్ ఎలా ఉండబోతుందనే ప్రధాన ప్రశ్నపై దృష్టి సారిస్తున్నారు. స్వాతంత్ర్య శతాబ్దిని దృష్టిలో ఉంచుకుని దేశ భవిష్యత్తుపై సమగ్ర చర్చలు జరగనున్నాయి.

ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, హర్యానా సీఎం నాయక్ సింగ్ సైనీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొననున్నారు. ఇతర రాజకీయ ప్రముఖులలో స్మృతి ఇరానీ, అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రముఖులు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. వ్యాపార సలహాదారు రామ్ చరణ్, అలాగే మార్కస్ వాంబాక్, బెర్ణ్డ్ ఓ హోర్మాన్ వంటి ప్రముఖులు పాల్గొని భారత్ అభివృద్ధి మార్గంపై విశ్లేషణ చేయనున్నారు. మొత్తానికి, దేశ అభివృద్ధి దిశగా కీలక ఆలోచనలు, విధానాలు రూపుదిద్దుకునే వేదికగా ఈ సమ్మిట్ నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *