ఆన్లైన్ పేమెంట్లు, యూపీఐ లావాదేవీల యుగంలోనూ పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలంటే నేటికీ చాలామంది ఎక్కువగా విశ్వసించేది బ్యాంక్ చెక్కులనే. అయితే ఎప్పుడైనా గమనించారా? చెక్కుపై నగదు మొత్తాన్ని అక్షరాల్లో రాసేటప్పుడు చివరన Only లేదా మాత్రమే అని రాయడం మనందరికీ అలవాటు. పెద్దలు రాస్తుంటే చూసి మనమూ అలాగే ఫాలో అయిపోతుంటాం. అసలు ఇలా ఎందుకు రాయాలి? ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక పాత సంప్రదాయమా? లేక బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఏమైనా నియమం ఉందా? దీని వెనుక ఉన్న బ్యాంకింగ్ భద్రతా సూత్రాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.
మోసాలకు అడ్డుకట్ట వేసే బ్రహ్మాస్త్రం
మనం చెక్కుపై మొత్తాన్ని అక్షరాలలో రాసినప్పుడు, ఆ లైన్లో కొంత ఖాళీ స్థలం మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఖాళీని అలాగే వదిలేస్తే, దాన్ని అసరాగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు.. మీరు Ten Thousand అని రాసి వదిలేస్తే, దాని పక్కనే Five Hundred లేదా Rupees అని చేర్చి దాన్ని Ten Thousand Five Hundred గానో లేదా మరో మొత్తంగానో మార్చేసే ఆస్కారం ఉంది. అదే చివరన Only లేదా మాత్రమే అని రాస్తే, ఇక అక్కడ ఆ మొత్తం ముగిసిపోయిందని అర్థం. ఆ పదం పక్కన వేరే అక్షరాలను లేదా పదాలను జోడించడం అసాధ్యం. అంటే ఇది ఒక రకంగా చెక్కును ట్యాంపరింగ్ చేయకుండా కాపాడే లీగల్ సెక్యూరిటీ లాక్ అన్నమాట.
ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? తప్పనిసరా?
చెక్కు మొత్తం చివర ఖచ్చితంగా ONLY అని రాయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి అధికారిక చట్టబద్ధ నిబంధన లేదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం చెక్కుపై వివరాలు స్పష్టంగా ఉంటే సరిపోతుంది. అయితే యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులను Only అని రాయమని పదేపదే ప్రోత్సహిస్తుంటాయి. చెక్ క్లియరెన్స్ ప్రక్రియలో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా, మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు దీనిని ప్రామాణిక భద్రతా పద్ధతిగా పాటిస్తున్నాయి.
అంకెల్లో, అక్షరాల్లో తేడా వస్తే ఏం జరుగుతుంది?
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 18 ప్రకారం.. ఒక చెక్కుపై అంకెల్లో రాసిన మొత్తానికి, అక్షరాల్లో రాసిన మొత్తానికి మధ్య తేడా ఉంటే, అక్షరాల్లో రాసిన మొత్తాన్నే ప్రామాణికంగా పరిగణించాలని చట్టం చెబుతోంది. అయితే ఆచరణలో బ్యాంకులు రిస్క్ తీసుకోవు. రెండు చోట్లా అమౌంట్ తేడా వస్తే, మోసం జరిగే అవకాశం ఉందని భావించి ఆ చెక్కును తిరస్కరిస్తాయి. అందుకే రెండు చోట్లా మొత్తం స్పష్టంగా, ఒకేలా ఉండాలి.
చెక్కు రాసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
స్లాష్ అండ్ హైఫన్: అంకెల రూపంలో మొత్తం రాసిన బాక్స్‌లో అమౌంట్ తర్వాత ‘ / – ‘ గుర్తును తప్పనిసరిగా వేయాలి. దీనివల్ల పక్కన అదనంగా సున్నాలు (0) చేర్చలేరు.
ఖాళీ లైన్ కొట్టేయండి: అక్షరాల్లో మొత్తం రాసి, ‘Only’ అని రాసిన తర్వాత ఆ లైన్లో మిగిలి ఉన్న ఖాళీ స్థలంపై ఒక అడ్డగీత గీయాలి.
పేరు పక్కన స్పేస్ ఉండకూడదు: చెక్కు ఎవరికి ఇస్తున్నారో రాసేటప్పుడు, Pay అనే పదం పక్కనే వారి పేరును మొదలుపెట్టాలి. పేరు రాసిన తర్వాత మిగిలిన ఖాళీలో కూడా గీత గీయడం మంచిది.
అకౌంట్ పేయీ: చెక్కును కేవలం అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలనుకుంటే, చెక్కు పైభాగంలో ఎడమ వైపు రెండు సమాంతర గీతలు గీసి A/C Payee Only అని రాయడం మరవద్దు. దీనివల్ల ఎవరూ ఆ చెక్కును నగదుగా విత్‌డ్రా చేసుకోలేరు.
దిద్దుబాట్లు చేయవద్దు: చెక్కుపై కొట్టివేతలు, ఓవర్రైటింగ్ అస్సలు ఉండకూడదు. తేదీ, సంతకం స్పష్టంగా ఉండాలి.
చెక్కు అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు.. అది ఒక బలమైన చట్టబద్ధమైన ఆర్థిక పత్రం. దానిలో మనం చేసే చిన్న నిర్లక్ష్యం లేదా అస్పష్టత ఖాతాలోని డబ్బు గాల్లో కలవడానికి కారణం కావచ్చు. కాబట్టి వచ్చేసారి చెక్కు రాసేటప్పుడు చివరన ‘Only’ అని రాయడం, మిగిలిన ఖాళీని గీతతో పూరించడం అస్సలు మర్చిపోకండి.
