తాజావార్తలు

మహిళలందరికీ ప్రతీ నెలా రూ.2,500.. అప్పటినుంచే అమలు..? తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..


బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఈ వీడియో మార్ఫింగ్ చేయబడినదని, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ అని తేల్చింది. ఈ వీడియోను నమ్మవద్దని, సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసే వేదికల నుంచే తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఫ్యాక్ట్ చెక్ వివరాల ప్రకారం.. వైరల్ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు నిజమైనవే. అయితే అందులోని ఆడియోను కృత్రిమంగా మార్చేశారు. ఈ దృశ్యాలు 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో నిర్వహించిన 892వ బసవ జయంతి వేడుకకు సంబంధించినవని గుర్తించారు. అసలు వీడియోలోని దృశ్యాలను తీసుకుని, వాటికి ఏఐ ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేసినట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్ధారించింది. వైరల్ ఆడియోను ఏఐ డిక్టేషన్ పరికరాలతో పరిశీలించగా.. అది డీప్‌ఫేక్ ఆడియోగా గుర్తించారు.

సీఎం రెండు కొత్త హామీలను ప్రకటించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ఫ్యాక్ట్ చెక్ బృందం వివరించింది. అయితే వైరల్ వీడియోలో ప్రస్తావించిన రెండు అంశాలలో ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఉన్నదే. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఇంకా అందించడంపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, కళ్యాణ లక్ష్మి కింద పేద కుటుంబాల్లో పెళ్లి చేసుకునే మహిళలకు తులం బంగారం అందిస్తామని ఆరు గ్యారెంటీల హామీలో ప్రకటించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

ప్రభుత్వ పత్రాల ప్రకారం అర్హులైన కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల ఈ పథకంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అయితే బతుకమ్మ నుంచి కళ్యాణ లక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం ప్రకటించినట్లుగా ఉన్న వీడియో మాత్రం డీప్‌ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాల అమలు, కొత్త ప్రకటనలు, అర్హతలు, తేదీలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలోని వీడియోలు, పోస్టుల ఆధారంగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రజలకు స్పష్టంగా సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *