
టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ మరోసారి మాస్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 22 రాత్రి నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న డింపుల్ హయాతికి దర్శకుడు సంపత్ నంది బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆమెపై చిత్రీకరించిన పాట విషయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానని అంగీకరించారు. పాటలో ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా, అభ్యంతరకరమైన కెమెరా యాంగిల్స్ లేకుండా చిత్రీకరిస్తానని ముందుగా డింపుల్‌కు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
అయితే సినిమా కోసం అనుకున్న విధంగా ఆ హామీని అమలు చేయలేకపోయానని సంపత్ నంది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘స్కిన్ షో, వల్గారిటీ లేకుండా రాజ్ కపూర్ గారిలా సాంగ్ చేస్తానని డింపుల్‌కి చెప్పాను. కానీ అలా చేయలేకపోయాను. అందుకు ఆమెకు సారీ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఈ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ‘భోగి’ ట్రైలర్ విషయానికి వస్తే.. పూర్తి గ్రామీణ వాతావరణం, మాస్ యాక్షన్ సన్నివేశాలు, రస్టిక్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. ఇందులో శర్వానంద్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తూ తన మాస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటిస్తున్నారు. కె.కె. రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ట్రైలర్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ‘భోగి’.. విడుదలకు ముందే దర్శకుడి వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తోంది. మరి శర్వానంద్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
