భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్యలు కర్వా చౌత్ ఉపవాసం ఉంటారు. ఓ మహిళకు పండుగ రోజున తీరని విషాదం ఎదురైంది. విద్యుదాఘాతంతో భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధలో ఉన్న ఆమెకు ఓదార్పు ఇవ్వాల్సిన కుటుంబ సభ్యులు విచిత్రంగా ఆరోపణలు చేశారు. ఉపవాసం మధ్యలో ఏమైనా తిన్నావా? అందుకే నీ భర్త చనిపోయాడంటూ ఆరోపించారు. భర్త మరణంతో దుఃఖంలో ఉన్న మహిళను మరింత కుంగదీశారు. ఈ ఘటన గురించి ఓ వైద్య విద్యార్థిని సోషల్ మీడియాలో వెల్లడించడంతో తీవ్ర చర్చ జరుగుతోంది.
విద్యుదాఘాతంతో భర్త మృతి.. ఆస్పత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
అక్టోబర్ 29న కర్వా చౌత్ పండుగ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీలో ఉన్న ఎంబీబీఎస్ ఇంటర్న్ డాక్టర్ ఆకాంక్ష సింగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. విద్యుదాఘాతానికి గురైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు గుర్తించారు. భర్త మరణవార్తతో అతడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కర్వా చౌత్ సందర్భంగా ఆమె భర్త క్షేమం కోసం ఉపవాసం ఉంది. అయితే ఆమె అత్త ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉపవాసం విరమించావా? అందుకే ఇలా జరిగిందా?
భర్త మరణంతో బాధపడుతున్న కోడలిని ఓదార్చాల్సిన అత్త ఆమె ఉపవాసం గురించి ప్రశ్నించడం ప్రారంభించింది. ‘నువ్వు కచ్చితంగా ఏదో ఒకటి తినే ఉంటావు కదా?’ అంటూ నిలదీసినట్లు వైద్య విద్యార్థిని వెల్లడించింది. తాను ఏమీ తినలేదని ఆ మహిళ పదేపదే చెప్పినా అత్త ఆరోపణలు ఆపలేదని తెలిపారు. చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆమెను ప్రశ్నించడంతో భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మహిళ మరింతగా ఏడ్చిందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో భర్తకు ఏదైనా అపాయం జరిగినా, మరణించినా భార్య ఉపవాసం సరిగా చేయలేదనే మూఢనమ్మకంతో ఆమెనే బాధ్యురాలిగా చూస్తారని డాక్టర్ ఆకాంక్ష అన్నారు.
సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనను డాక్టర్ ఆకాంక్ష సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భర్త మరణానికి విద్యుదాఘాతమే కారణమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ఉపవాసం పేరుతో భార్యను నిందించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పటికే భర్తను కోల్పోయి బాధలో ఉన్న మహిళను ఓదార్చాల్సింది పోయి, ఆమెనే నిందించడం ఎంతవరకు న్యాయం?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’21వ శతాబ్దంలో కొందరి ఆలోచనలు 17, 18వ శతాబ్దాల్లోనే ఉన్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
మరికొందరు మహిళలపై సమాజం విధిస్తున్న ఆచారాలు, నమ్మకాల ఒత్తిడిని ప్రశ్నించారు. చదువుకున్న, ఆర్థిక స్వేచ్ఛ ఉన్న మహిళలు సైతం సామాజిక ఒత్తిడితో ఇలాంటి ఆచారాలను పాటిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మహిళను ఉపవాసం పేరుతో నిందించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి మరణానికి కారణం తెలుసుకోవాల్సింది పోయి, సంప్రదాయాల పేరుతో మహిళనే బాధ్యురాలిగా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
