ఒక అమ్మమ్మ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటే.. ఆ రోజుల్లో సరిపడా తిండి దొరకని పరిస్థితి, ఆకలితో కూడిన నిత్య భయమే ఆమెకు గుర్తిస్తుంది. అదే నగరంలో పెరుగుతున్న ఆమె మనుమడికి ఆకలి బాధ అంటే ఏంటో తెలియదు. కానీ, చిన్న వయసులోనే అతడి రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar) పెరగడం గమనించి డాక్టర్లు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ రెండు భిన్నమైన పరిస్థితులు ఒకే దేశంలో, కొన్నిసార్లు ఒకే కుటుంబంలో ఒకే సమయంలో జరుగుతున్న వాస్తవాలు.
భారత ప్రభుత్వ తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-6) గణాంకాలు వెల్లడిస్తున్న ఈ విశ్లేషణ, మన దేశ ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక కీలక అంశాలను వెలుగులోకి తెస్తోంది..
ఒకవైపు తగ్గుతున్న పోషకాహార లోపం:
భారత్ ఒక రంగంలో నిజమైన, స్పష్టమైన పురోగతిని సాధించింది. ఐదేళ్లలోపు పిల్లలలో దీర్ఘకాలిక పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల మందగించడం (Stunting) గణనీయంగా తగ్గింది.
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 (2019-21) నాటికి 35.5 శాతంగా ఉన్న ఈ సమస్య.. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 (2023-24) నాటికి 29.3 శాతానికి పడిపోయింది. కేవలం కొన్ని సంవత్సరాలలోనే దాదాపు 6 శాతం మెరుగుదల కనిపించింది.
మెరుగైన మాతా శిశు పోషకాహారం, విస్తరించిన ప్రభుత్వ ఆహార పథకాలు, పారిశుద్ధ్యం – మెరుగైన ఆరోగ్య సేవలు ఎక్కువ కుటుంబాలకు అందడమే దీనికి ప్రధాన కారణం.
మరోవైపు వేగంగా పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం:
ఒకవైపు పౌష్టికాహార లోపం తగ్గుతుంటే, సరిగ్గా అదే సమయంలో మరో ముప్పు తీవ్ర రూపం దాలుస్తోంది.
అధిక బరువు / ఊబకాయం: భారతీయ మహిళల్లో అధిక బరువు లేదా ఊబకాయం సమస్య 2005-06లో 12.6 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి అది 30.7 శాతానికి (రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలో రెట్టింపు కంటే ఎక్కువగా) పెరిగింది.
రక్తంలో చక్కెర స్థాయిలు (High Blood Sugar): మహిళల్లో బ్లడ్ షుగర్ సమస్య 13.5 శాతం నుండి 17.8 శాతానికి పెరగగా.. పురుషులలో ఇది 21 శాతానికి చేరుకుంది.
‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’ (ద్విముఖ ఆరోగ్య భారం):
ఈ గణాంకాలను కలిపి పరిశీలిస్తే.. ఆరోగ్య నిపుణులు పిలుస్తున్న ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’ (అంటే ఒకవైపు పోషకాహార లోపం, మరోవైపు అతిగా పోషకాలు లేదా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే సమస్యలు) స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి కేవలం వేర్వేరు వ్యక్తుల్లోనే కాకుండా, కొన్నిసార్లు ఒకే కుటుంబంలో లేదా ఒకే వ్యక్తి జీవితంలోని వేర్వేరు దశల్లోనూ కనిపిస్తున్నాయి.
భారతదేశాన్ని ఒక అనారోగ్య సంక్షోభం నుంచి బయటపడేస్తున్న కొన్ని ఆర్థికాభివృద్ధి మార్పులే.. మరోవైపు సరికొత్త అనారోగ్యాలకు కారణమవుతున్నాయి.
శారీరక శ్రమ తగ్గడం, కూర్చునే ఉద్యొగాలు పెరగడం, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం, ప్రాసెస్డ్ ఫుడ్ (Fast food, calorie-dense food) వినియోగం విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
కేవలం గత తరంతో పోలిస్తే ఆహారం లభ్యత పెరిగిందని, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని భావించడం సరికాదు. పూర్వం ఉన్న ఆకలి సమస్య స్థానంలో ఇప్పుడు జీవనశైలి వ్యాధులు (Diabetes, Obesity) వచ్చి చేరాయి.
వచ్చేసారి మన కుటుంబాల్లోని వివిధ తరాల ఆరోగ్యాన్ని బేరీజు వేసుకునేటప్పుడు.. ఒక తరానికి ఉన్న సమస్య వేరు, నేటి తరానికి ఎదురవుతున్న ముప్పు వేరని గుర్తించాలి. ఏ తరానికి ఏ రకమైన ఆరోగ్య ప్రమాపాలు పొంచి ఉన్నాయో ముందే గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడమే అసలైన ఆరోగ్యం!
