తాజావార్తలు

Telangana: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తెలంగాణపై కూడా ఎఫెక్ట్.. వాతావరణశాఖ కీలక అప్డేట్..


ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం వాయువ్య-ఉత్తర దిశగా కదిలి నవంబర్ 16న సాయంత్రం 17:30 గంటలకు తుఫానుగా బలపడింది. దీనికి అక్వాన్‌ తుఫాన్‌గా పేరు నామకరణం చేశారు. ఇది దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. నిన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న “అక్వాన్” (Akvan) తుఫాను గత 6 గంటలుగా గంటకు 03 కి.మీ. వేగంతో నెమ్మదిగా వాయువ్య-ఉత్తర దిశగా కదిలి నవంబర్ 17న ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో 12.2° ఉత్తర అక్షాంశం, 85.7° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నై (తమిళనాడు)కు తూర్పున సుమారు 610 కి.మీ.,ట్రింకోమలీ (శ్రీలంక)కు ఈశాన్యంగా 630 కి.మీ, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కు ఆగ్నేయంగా 660 కి.మీ, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 670 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 790 కి.మీ. దూరంలో ఉంది.

ఈ నెల 20న తీరం దాటేది అక్కడే..

అక్వాన్ తుఫాన్ వాయువ్య-ఉత్తర దిశగా కదులుతూ నవంబర్ 17న సాయంత్రం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 19న ఉదయం నాటికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఇది నవంబర్ 20న మధ్యాహ్నం సమయంలో అతి తీవ్ర తుఫానుగా నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ. వేగంతో, గరిష్టంగా 145 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాన్ క్రమంలో వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణశాఖ విడుదల చేసింది.

ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతారణశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, పలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది.

ఏపీకి భారీ వర్షసూచన

అక్వాన్ తుఫాన్ ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండనుంది. ఈ తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉండనుందని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఏపీవ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అర్నబ్ తరహాలోనే అక్వాన్ తుఫాన్ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *