తాజావార్తలు

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193


RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు చేయాల్సి ఉంది.

టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగుకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (18)ను భువనేశ్వర్ కుమార్ త్వరగానే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే (19) కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే, ఈ దశలో అంగ్‌క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేవలం 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను, మైదానం నలుమూలలా షాట్లతో అలరించాడు. అతనికి తోడుగా ఆల్ రౌండర్ కేమరూన్ గ్రీన్ (32) రాణించగా.. చివర్లో రింకూ సింగ్(49*) తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. దురదృష్టవశాత్తు రింకూ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్ తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ కూడా రహానేను అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. రసిక్ సలామ్ దార్ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ, డెత్ ఓవర్లలో కోల్‌కతా బ్యాటర్లను అడ్డుకోవడంలో ఆర్‌సీబీ బౌలర్లు కాస్త తడబడ్డారు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో కేకేఆర్ బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో స్కోరు 190 దాటింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఈ భారీ ఛేజింగ్‌లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి రాయ్‌పూర్‌లో వర్షం కారణంగా టాస్ పడటంలో చాలా ఆలస్యమైంది. ఒకానొక దశలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగినా, వరుణుడు కరుణించడంతో పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న ఆర్‌సీబీకి ఈ విజయం చాలా ముఖ్యం. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. మరోవైపు, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కోల్‌కతాకు ఈ గెలుపు అనివార్యం. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ బ్యాటర్లు రాయ్‌పూర్ పిచ్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *