రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ సైన్యంలో పనిచేస్తున్నఅధికారి లెవ్ స్టుప్నికోవ్ ఉక్రెయిన్‌కు రహస్య సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైన్యంలో లెఫ్టినెంట్ స్థాయి అధికారిగా పనిచేసిన అతడు.. తన దేశ సైనికుల కదలికలు, యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్‌కు చేరవేసినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా జరిగిన దాడుల్లో 300 మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. నిఘా వ్యవస్థల నుంచి వచ్చే సమాచారాన్ని కమాండర్లకు చేరవేయడం లెవ్ స్టుప్నికోవ్ విధుల్లో భాగం. రష్యా సైనికుల కదలికలు, యుద్ధ ప్రణాళికలు, నిఘా డ్రోన్లు, నిఘా కెమెరాల నుంచి వచ్చే సమాచారం అతడికి అందుబాటులో ఉండేది. అయితే, ఈ సమాచారాన్ని రహస్యంగా ఉక్రెయిన్ సైనిక నిఘా విభాగానికి చేరవేయడం ప్రారంభించాడు.
అతడు ఇచ్చిన సమాచారంతో భారీ దాడి!
రష్యా సైన్యంలోని తన సహచరులకు తెలియకుండా ఉక్రెయిన్‌కు సమాచారం చేరవేసిన స్టుప్నికోవ్.. ఓ కీలక దాడికి సంబంధించిన వివరాలను కూడా అందించాడు. తూర్పు ఉక్రెయిన్‌లో ఓ రోజు అతడు కడుపునొప్పి వచ్చినట్లు నటించి తోటి సైనికుల నుంచి దూరంగా వెళ్లాడు. కొద్దిసేపటికే అతడు ముందుగా అందించిన లక్ష్యాలపై ఉక్రెయిన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడిలో రష్యాకు చెందిన 68 మంది సైనికులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో కల్నల్ గుసేన్ ముసాయేవ్ కూడా ఉన్నారు.
దాడి జరిగిన తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి స్టుప్నికోవ్కు సందేశం పంపుతూ.. అక్కడ పేలుళ్లు జరిగాయా? ఫొటో పంపించాలని అడిగాడు. అందుకు స్టుప్నికోవ్ ఇచ్చిన సమాధానం షాకయ్యేలా ఉంది. అక్కడ మృతదేహాలు తప్ప మరేమీ లేవన్న అర్థం వచ్చేలా అతడు బదులిచ్చాడు. స్టుప్నికోవ్ ఒక్కడే కాదు మరికొంత మంది రష్యా సైనికులు కూడా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఉక్రెయిన్ ఏజెంట్లను సంప్రదిస్తున్నారని కథనం బయటపెట్టింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం.. అతడిలో మార్పు!
స్టుప్నికోవ్ రష్యా సైన్యానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబు దాడులకు సంబంధించిన వీడియోలు చూడటమే. ఆ వీడియోలు అతడిని తీవ్రంగా కలచివేసాయి. అమాయక పౌరులపై బాంబులు వేస్తున్నారని, అది దుష్ట చర్య అని స్టుప్నికోవ్ బాధపడ్డాడు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ తోటి సైనికులు సాధారణ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కాదనీ మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఇంట్లో భార్య లిజాతో కలిసి రష్యా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల వీడియోలు, ఉక్రెయిన్ చెరలో ఉన్న రష్యా యుద్ధ ఖైదీల ఇంటర్వ్యూలు చూసేవాడు.మిలిటరీ అకాడమీ నుంచి బయటపడటానికి స్టుప్నికోవ్ ప్రయత్నించాడు. తనలాంటి ఆలోచనలు చేసే మరి కొందరితో కలిసి అకాడమీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, వారి అభ్యర్థనలు నెలల తరబడి పెండింగ్‌లో ఉండేవి. తన భావాలను బయటకు వ్యక్తపరచలేక, లోలోపల కుమిలిపోయేవాడు స్టుప్నికోవ్.
ఉక్రెయిన్ నిఘా విభాగంతో తల్లి సంబంధాలు ఏర్పాటు
స్టుప్నికోవ్ తల్లి టటియానా యాంట్సెన్ పుతిన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేది. పుతిన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొంది. 2024 ఫిబ్రవరిలో, స్టుప్నికోవ్ యుద్ధరంగంలో విధుల్లో చేరిన తర్వాత, టటియానా ఉక్రెయిన్ తో సంబంధాలు ఉన్న రష్యా కంప్యూటర్ ప్రోగ్రామర్ దిమిత్రో కార్పెంకోను సంప్రదించింది. రష్యా సైనికుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కార్పెంకో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఓ నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు. రష్యా యుద్ధ ఖైదీలతో ఇంటర్వ్యూలు చేసి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుంటాడు. ఉక్రెయిన్‌కు ఉపయోగపడే సైనిక సమాచారాన్ని రష్యా సైనికులు అందిస్తే 2.5 లక్షల రూబుళ్లు, అంటే అప్పటి లెక్కల ప్రకారం సుమారు 2,700 డాలర్లు చెల్లించాడు. ఈ నెట్వర్క్ సహాయంతోనే స్టుప్నికోవ్ రష్యా సైన్యం నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడింది.
రాత్రికి రాత్రే సైన్యం నుంచి పరార్!
2024 జూలైలో స్టుప్నికోవ్ రాత్రి సమయంలో రష్యా సైనిక విభాగం నుంచి తప్పించుకుని ఉక్రెయిన్ సైన్యం ఉన్న ప్రాంతం వైపు వెళ్లాడు. అతడి కదలికలను ఉక్రెయిన్ సైనికులు ఓ భూగర్భ బంకర్ నుంచి లైవ్ వీడియో ద్వారా పర్యవేక్షించారు. సుమారు 40 నిమిషాల ప్రయాణం తర్వాత అతడు ఉక్రెయిన్ 72వ బ్రిగేడ్ సైనికులు ఉన్న చెట్ల ప్రాంతానికి చేరుకున్నాడు. రష్యా సైనిక దుస్తుల్లో ఒక వ్యక్తి తమవైపు రావడాన్ని గమనించిన ఉక్రెయిన్ సైనికులు అప్రమత్తమయ్యారు. అతడిపై తుపాకులు గురిపెట్టి రహస్య సంకేత పదాన్ని అడిగారు. స్టుప్నికోవ్ ముందుగానే నిర్ణయించుకున్న సంకేత పదమైన ‘పీనట్ షాప్’ అని చెప్పడంతో అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడు పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న రష్యన్ వాలంటీర్ కార్ప్స్ (RVC)లో చేరాడు. ప్రస్తుతం స్టుప్నికోవ్ కమ్యూనికేషన్ నిపుణుడిగా పనిచేస్తున్నాడు.
తల్లి, సోదరి కూడా ఉక్రెయిన్‌కు వెళ్లేందుకు ప్రయత్నం
స్టుప్నికోవ్ రష్యా సైన్యం నుంచి తప్పించుకున్న తర్వాత అతడి కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. రష్యా సైనిక అధికారులు అతడి తల్లి టటియానాకు పలుమార్లు ఫోన్ చేసి, అతడు బతికే ఉంటే తిరిగి లొంగిపోయేలా ఒప్పించాలని కోరింది. అయితే, తన కుమారుడి ఆచూకీ కనుగొనాల్సిన బాధ్యత అధికారులదేనని ఆమె చెప్పింది. 2025 ఫిబ్రవరిలో టటియానా, స్టుప్నికోవ్ సోదరి కలిసి మోల్డోవా మీదుగా ఉక్రెయిన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
స్టుప్నికోవ్ తన అనుభవాలను కార్పెంకోతో రెండు గంటల వీడియో ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అతడు రష్యా సైన్యాన్ని విడిచిపెట్టడం, ఉక్రెయిన్‌కు అందించిన రహస్య సమాచారం మరోసారి చర్చనీయాంశమైంది. మిలిటరీ అకాడమీలో చేరినప్పుడు దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతానని ప్రమాణం చేశాననీ, అయితే, పుతిన్ ప్రారంభించిన యుద్ధం ఆ సూత్రాలనే దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. ‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, రాజ్యాంగ వ్యవస్థను కాపాడతానని ప్రమాణం చేశాను. కానీ పుతిన్ ఆ మూడింటినీ నాశనం చేశారు’ అనే అర్థంలో స్టుప్నికోవ్ వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది.
