రైల్వే ట్రాక్ మధ్యలో, చుట్టుపక్కల వేసే ఈ రాళ్లను 'ట్రాక్ బ్యాలస్ట్' అంటారు. ఇవి పట్టాలను సరైన దూరంలో స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సాధారణంగా పగులగొట్టిన గట్టి రాళ్లతో తయారు చేస్తారు. ఇండియన్ రైల్వేస్ (RDSO) ప్రకారం.. బ్యాలస్ట్ స్లీపర్లకు సమతల పడకను అందించి, వాటిని కదలకుండా స్థిరంగా పట్టి ఉంచుతుంది. రైలు చక్రాల నుంచి వచ్చే భారీ భారాన్ని నేలపై విస్తృత ప్రాంతానికి సమానంగా పంచుతుంది.
ఈ రాళ్లు నునుపుగా కాకుండా కాస్త గరుకుగా, కోణీయంగా ఉండటం వల్ల అంచులు ఒకదానికొకటి బలంగా అతుక్కుని ఉండి పట్టాల స్థిరత్వాన్ని పెంచుతాయి. ఎంతటి భారీ లోడ్‌తో వెళ్లే రైలు ఒత్తిడినైనా తట్టుకుని ట్రాక్‌ను స్థిరంగా ఉంచుతాయి. సాధారణంగా పట్టాల కింద వర్షపు నీరు చేరితే నేల బలహీనపడుతుంది. కానీ ఈ బ్యాలస్ట్ రాళ్ల మధ్య ఉండే ఖాళీల వల్ల వర్షపు నీరు సులభంగా జారిపోతుంది. దీనివల్ల ట్రాక్ పునాదికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
అంతేకాదు.. ట్రాక్‌పై వేసే ఈ కంకర రాళ్లు నేలను పూర్తిగా కప్పి ఉంచడం వల్ల పట్టాల వద్ద కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు పెరిగే ఆస్కారం ఉండదు. అయితే రాళ్ల మధ్య మట్టి లేదా సేంద్రీయ పదార్థాలు పేరుకుపోయినప్పుడు మాత్రం మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరిగిన వాటిని అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తుంటారు.
ఒకవేళ రైలు ట్రాక్ కింద ఈ కంకర రాళ్లు కనుక లేకపోతే, పట్టాలు పూర్తిగా స్థిరత్వాన్ని కోల్పోతాయి. రైలు బరువుకు పట్టాలు కదిలిపోవడంతో పాటు నేలలోకి కూరుకుపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధారణ రైల్వే ట్రాక్‌లలో కచ్చితంగా ఈ కంకరను ఉపయోగిస్తారు.
అయితే మెట్రో వంటి కొన్ని ప్రత్యేక మార్గాలలో మాత్రం వదులుగా ఉండే రాళ్లకు బదులుగా గట్టి కాంక్రీట్ ఆధారంతో కూడిన 'స్లాబ్ ట్రాక్' పద్ధతిని ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటిని నేలపై కాకుండా ఎత్తులో పిల్లర్లపై నిర్మిస్తారు కాబట్టి మెట్రో ట్రాక్‌లపై ఈ స్లాబ్ ట్రాక్‌ను వాడతారు. అంతేకాకుండా ఇది తక్కువ పొడవు, తక్కువ బరువు ఉండటం కూడా వీటికి కలిసొచ్చే అంశం.





