బాల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత సున్నితమైన , భావోద్వేగభరితమైన సమయం. ఈ వయస్సులో పిల్లల మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూపించే కోపం, విపరీతమైన చిరాకు లేదా ఆకస్మిక విచారాన్ని కేవలం వారి మొండితనం లేదా అల్లరి అని భావించి తేలికగా విస్మరిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. పిల్లలు తమ మనసులోని భయాలను, ఒత్తిళ్లను లేదా బయటి వ్యక్తుల నుండి ఎదురైన చెడు అనుభవాలను మాటల రూపంలో స్పష్టంగా వ్యక్తపరచలేనప్పుడు, వాటిని శారీరక మార్పులు లేదా కోపం రూపంలో బయటపెడుతుంటారు. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నివేదికల ప్రకారం, పిల్లలలో మానసిక ఒత్తిడి, ఆందోళన (యాంగ్జైటీ) లేదా కుంగుబాటు (డిప్రెషన్) ఉన్నప్పుడు కనిపించే 6 ప్రధాన లక్షణాల వివరాలు ఇక్కడ చూద్దాం.
పిల్లలలో గమనించవలసిన ఆ 6 ముఖ్యమైన లక్షణాలు
నిరంతర నిరాశ లేదా ఆసక్తి లేకపోవడం: పిల్లలు సాధారణంగా ప్రతి విషయానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలా కాకుండా వారు పదేపదే తీవ్రమైన నిరాశకు గురవుతున్నా, లేదా గతంలో ఇష్టంగా చేసిన పనులపై, ఆటలపై అకస్మాత్తుగా ఆసక్తిని కోల్పోతున్నా దానిని తీవ్రంగా పరిగణించాలి.
తలనొప్పి , కడుపునొప్పి ఫిర్యాదులు: ఎటువంటి స్పష్టమైన శారీరక అనారోగ్య కారణం లేకపోయినప్పటికీ, పిల్లలు తరచుగా కడుపునొప్పి లేదా తలనొప్పి వస్తోందని ఫిర్యాదు చేస్తుంటే అది మానసిక ఒత్తిడికి సంకేతం కావచ్చు. మనసులోని ఆందోళనలు పిల్లల్లో ఇలా శారీరక నొప్పుల రూపంలో వ్యక్తమవుతుంటాయి.
చిరాకు విపరీతంగా పెరగడం: ప్రతి చిన్న విషయానికి విపరీతంగా చిరాకు పడటం, అకారణంగా విసుగు ప్రదర్శించడం కూడా పిల్లల అంతర్గత మానసిక అశాంతిని సూచిస్తుంది.
ఆకస్మిక భావోద్వేగ మార్పులు: పిల్లల మూడ్స్ చాలా వేగంగా మారడం, అంటే ఒక నిమిషం క్రితం వరకు ఎంతో సంతోషంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా తీవ్రమైన విచారంలోకి లేదా కోపంలోకి మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులు వారి మనస్సు తీవ్రమైన ఒత్తిడిలో ఉందనడానికి బలమైన నిదర్శనం.
ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం: చిన్నపాటి విషయాలకే విపరీతంగా కోపగించుకోవడం, ఇంట్లో వాళ్లతో లేదా తోటి పిల్లలతో పదేపదే గొడవ పడటం వంటి ప్రవర్తనను కేవలం మొండితనం అనుకోకూడదు.
సహాయం కోసం..: కొన్నిసార్లు పిల్లల ప్రవర్తనలో వచ్చే ఆకస్మిక మార్పులు వారు లోలోపల ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడటానికి పెద్దల సహాయాన్ని కోరే నిశ్శబ్ద ఆర్తనాదంగా భావించాలి.
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తోంది. పిల్లలలో కనిపించే ఈ ప్రవర్తనా మార్పులు పాఠశాలలో ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థుల నుండి ఎదురవుతున్న ఒత్తిడి, స్నేహితులతో సమస్యలు, కుటుంబంలో జరిగే కలహాలు లేదా వారిలోని ఒంటరితనానికి సంకేతంగా ఉండవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పి భయపెట్టినా పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు.
అందుకే పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వారిని చిన్న విషయాలకే తిట్టడం లేదా కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మొదటి , ఉత్తమ స్నేహితులుగా మారాలి. ప్రతిరోజూ వారితో నిష్కపటంగా, సానుకూలంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వారు చెప్పే ప్రతి మాటను మధ్యలో అడ్డుకోకుండా శ్రద్ధగా వినాలి. ఒకవేళ ఈ మార్పులు చాలా రోజుల పాటు అలాగే కొనసాగుతూ ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అనుభవజ్ఞులైన బాలల మనస్తత్వవేత్త (చైల్డ్ సైకాలజిస్ట్) లేదా కౌన్సిలర్‌ను సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తును సురక్షితంగా కాపాడుకోవచ్చు.
