తాజావార్తలు

Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ

Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ


ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు ఈ నోటీసులు పంపింది. తాజాగా ఈ షోకాజ్ నోటీసులపై జానీ మాస్టర్ స్పందించాడు. ఈ మేరకు తెలుగు సినిమా నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా పేరు SK.జానిబాష (ప్రముఖ కొరియోగ్రాఫర్‌, మాజీ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ TFTDDA) ఒక బాధ్యతగల కొరియోగ్రాఫర్‌ గా డాన్సర్స్‌ యూనియన్‌ కి ఒక మాజీ ప్రెసిడెంట్‌ గా నా మనోవేదనను నిర్మాతల దృష్టికి తీసుకుని వస్తున్నాను. నేను ఒక సినీ కార్మికుడిగా నా ఎదుగుదలకి నా సంక్షేమానికి దోహదపడింది ముమ్మాటికీ సినీ నిర్మాతలు అని ప్రగాడంగా నమ్ముతాను. అందుకే ప్రతీ నిర్మాతను మేము దైవసమానులుగా భావిస్తాం. ఎప్పటికీ కృతజ్ఞతతో నిర్మాతల కోసం మా శాయశక్తులా పని చేస్తాం. చిన్న, పెద్ద, అని తేడా లేకుండా ప్రతీ నిర్మాత క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. నిర్మాత బ్రతికి ఉంటే పదిమందిని బ్రతికిస్తాడు. నిర్మాత క్షేమంగా ఉంటే పదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాడు అలాంటి నిర్మాత ఈరోజు ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటున్నాడు. పైరసీ రూపంలో కొంతమంది అవినీతికి పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారి నుండి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ కూడా సినిమా మీద ఆసక్తి తో వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మా అందరికీ పని కల్పిస్తున్నారు నిర్మాతలు’

‘మా డాన్సర్స్‌ కి నిర్మాతల నుంచి వచ్చిన డబ్బులు మా యూనియన్‌ లో ఉన్న కొంతమంది ప్రోగ్రాం ఇంచార్జీ లు దోచుకుని తింటున్న వారిపై చర్యలు తీసుకుంటుంటే, ఫెడరేషన్‌ వారి తప్పులను కప్పిపుస్తూ వారికి సహకరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా మా అసోసియేషన్‌ కి ఫెడరేషన్‌ అడ్డు పడుతుంది. దీనికి నష్టపోయిన డాన్సర్‌ సభ్యులు అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులపై, ప్రెసిడెంట్‌పై తీవ్రమైన ఒత్తిడిని పెడుతున్నారు. అందుచేత చర్యలు తీసుకున్న క్రమంలో ఫెడరేషన్‌ వారు అడ్డు పడుతూ అవినీతి చేసిన వారి తప్పులను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా డాన్సర్స్‌ కష్టానికి తగ్గ డబ్బులు నిర్మాతలు ఇస్తుంటే ఆ డబ్బులు కొంతమంది దోచేస్తున్నారు అలాంటి వారికి ఫెడరేషన్‌ పెద్దలు సహకరిస్తున్నారు’

‘మా సభ్యులు అందరూ నిర్మాత క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మా వంతు బాధ్యతగా మా అసోసియేషన్‌ లో ప్రస్తుత ప్రెసిడెంట్‌ గా ఉన్న V.V. సుమలతా దేవి చొరవతో అవినీతి చేస్తున్న కొంతమంది ప్రోగ్రాం ఇంచార్జీ లను వారు ప్రొడక్షన్‌ కంపెనీ కి పెడుతున్న అక్రమ బిల్లులను పరిశీలించారు. అవినీతి చేసిన వారిని సస్పెండ్‌ చేస్తూ, మా యూనియన్‌ లో పదివీ బాధ్యతతో ఉన్న వారిపై కూడా నిర్మాతలను మరియు మా డాన్సర్స్‌ ను మోసం చేసిన వారిపైన కూడా వారి పదవిని కూడా తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అలా అవినీతికి పాల్పడిన మా జెనరల్‌ సెక్రెటరీ ని పదవి నుంచి తొలగించాము. తనకి సపోర్ట్‌ చేస్తూ కొంతమంది కమిటీ సభ్యులు రాజీనామాలు చేసిన వారిని కూడా జనరల్‌ బాడీ మీటింగ్లో తొలగించి ఉపఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్మానం చేసుకున్నాం.

అలా చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఫెడరేషన్‌ నుంచి మాకు సహకారం అందలేదు, ఎంత అవినీతి చేసినా కుడా వారితో కలసి పని చెయ్యాలని, మా ప్రెసిడెంట్‌ సుమలతా దేవి గారిని మిగిలి ఉన్న (రాజీనామాలు చేయని) కమిటీ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మా యూనియన్‌ అంతర్గత విషయాలలో తలదూర్చి మా స్వేచ్చకు భంగం కలిగిస్తున్నారు ఫెడరేషన్‌ పెద్దలు. నిన్న అనగా 16-07-2026 తేదీన ఫెడరేషన్‌ లో జరిగిన జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ లో మేము సస్పెండ్‌ చేసి పదవి నుంచి తొలగించిన వారిని మళ్ళి వారి పదవిలో కొనసాగించాలని కలుపుకొని పోవాలని మా ప్రెసిడెంట్‌ సుమలతా దేవిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ కు హాజరు అయిన వారిలో కొంతమంది కౌన్సిల్‌ మెంబెర్‌ లు అన్న మాటలు మాకు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి’

మీ అసోసియేషన్‌ డబ్బులు దోచుకోలేదు కదా, నిర్మాతల డబ్బులు కదా ఇందులో తప్పు ఏమి ఉంది ఇలాంటివి చూసీ చూడనట్లుగా కలుపుకుని పోవాలి అని మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటున్నా కూడా ఫెడరేషన్‌ పెద్దలు మౌనంగా ఉండటం మా అసోసియేషన్‌ అధ్యక్షురాలు, కమిటీ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఫెడరేషన్‌ పెద్దలు ఒకవైపు నిర్మాతల శ్రేయస్సు కోసం ఉన్నాము అంటూ బయట చెబుతూ, ఇలా నిర్మాతలను మోసం చేస్తున్న వారిని చూసీ చూడనట్లు పోవాలి అని మాట్లాడుతున్నారు వారిని తొలగిస్తే మళ్ళి పదవిలోకి తీసుకోండి అని మాపై జులుం చూపిస్తూ వారు చెప్పినట్లు వినకపోతే ఫెడరేషన్‌ నుంచి ‘నాన్‌ క్రో ఆపరేషన్‌’ చేస్తామని పదే పదే బెదిరిస్తూ బ్లాక్మెయిల్‌ చేస్తున్నారు. ఫెడరేషన్‌ పెద్దలు ఒకవైపు కార్మికుల క్షేమమే మా ధ్యేయం అని చెబుతూ మరోవైపు డాన్సర్స్‌ కు చెందాల్సిన డబ్బులు ను దోచుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’

‘మా ప్రెసిడెంట్‌ గారు ఒంటరి మహిళగా మా అసోసియేషన్‌ లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతూ నిర్మాతల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ మా యూనియన్‌ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కానీ ఫెడరేషన్‌ వారికి అధికారాలు ఉన్నాయి అని లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు రూల్స్‌ చెబుతూ మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ వారు చెప్పినట్లే వినాలి అని లేకుంటే ఫెడరేషన్లో సభ్యత్వాన్ని తొలగిస్తామని (Boycott) చేస్తామని చెబుతున్నారు. ఒక మహిళా మేము చెప్పినట్లు వినదా? మా పరువుకు భంగం కలుగుతుందనే నెపంతో లింగ బేధం కనబరుస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఫెడరేషన్‌ పెద్దలు, మేము డాన్సర్స్‌ యూనియన్‌ ఎల్లవేళలా నిర్మాత క్షేమాన్ని కోరుకుంటాం’.

అలాంటి నిర్మాతను, మా డాన్సర్స్‌ ను మోసం చేసే బేరర్స్‌ ను ప్రోగ్రాం ఇంచార్జీ లను వారి అవినీతిని సహించం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ మాకు ఫెడరేషన్‌ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవినీతి చేసిన వారిని,, వారి అవినీతిని ప్రోతహిస్తున్న కొంతమంది కమిటీ సభ్యులను వదిలి వెయ్యాలని ఫెడరేషన్‌ వారు కలుపుకుని పోవాలని సూచిస్తున్నారు. కావున దయచేసి నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి నిర్మాతలు చొరవ తీసుకుని, ఫెడరేషన్‌ వారు చేస్తున్న నాటకీయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మా డాన్సర్స్‌ యూనియన్‌ అంతర్గత విషయాలలో జోక్యం తీసుకోనివ్వకుండా మేము స్వేచ్చగా ఉపఎన్నికలు జరుపుకునేలా చూడాలని నిర్మాతల పెద్దల్ని ప్రాదేయపడుతున్నాను’

‘మా స్వేచ్చకు ఫెడరేషన్‌ వారి నుంచి మా డాన్సర్స్‌ యూనియన్‌ కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఫెడరేషన్‌ వారిని మందలిస్తారని ఆశిస్తున్నాం. ఎల్లప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకునే మా డాన్సర్స్‌ యూనియన్‌ ను ఆదుకుంటారని ఒక భాద్యత గల ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గా ఒక మాజీ అధ్యక్షుడుగా వినమ్రతతో సినీ నిర్మాతల పెద్దల్ని ప్రాదేయపడుతున్నాను. నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు జానీ మాస్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *