తాజావార్తలు

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

Bobbili:  ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు


విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి, మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.

పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నంకు చెందిన బెజ్జుపల్లి భార్గవి (14) తన కుటుంబంతో కలిసి బొబ్బిలిలో జరిగే అమ్మవారి పండుగకు వచ్చింది. పండుగ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు కిక్కిరిసిపోయి ఉండగా, ఎక్కిన తర్వాత సీటులో కూర్చున్న ఓ మహిళకు భార్గవి భుజానికి ఉన్న బ్యాగ్ తగిలింది. ఈ విషయంపై ప్రారంభమైన మాటల యుద్ధం చినికిచినికి గాలివానలా మారి, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ క్రమంలో భార్గవి తీవ్రంగా గాయపడింది.

అక్కడున్న ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకున్నప్పటికీ, కొంతసేపటికి మాత్రమే పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన బాలికను ముందుగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘర్షణకు కారణమైన మహిళలు ఘటన అనంతరం పరారయ్యారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పండుగ సమయాల్లో ఆర్టీసీ కేంద్రాల్లో జనసంచారం అధికంగా ఉండే నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *