Asian Para Games 2026: చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం అతడి జీవితాన్ని మార్చేసింది. ఆరేళ్ల వయసులోనే కుడిచేయిని కోల్పోయాడు. అయినా అతడి కలలు ఆగలేదు.. ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ఎన్నో కష్టాలను దాటుకుంటూ క్రీడల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆసియా పారా గేమ్స్‌లో వరుసగా రెండు స్వర్ణ పతకాలు గెలిచి దేశం గర్వపడేలా చేశాడు. అతడే భారత పారా అథ్లెట్ నిషాద్ కుమార్. అతడి విజయగాథ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
రెండు రోజులు.. రెండు స్వర్ణాలు
జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా గేమ్స్‌లో నిషాద్ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోమవారం పురుషుల T47 లాంగ్ జంప్ పోటీల్లో 7.11 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత మంగళవారం హైజంప్ T47 విభాగంలో 2.04 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిగమించి మరో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, హైజంప్‌లో కొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పాడు. ఒకే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు గెలవడం అతడి కెరీర్లో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది.
మూడో భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత
ఒకే ఆసియా పారా గేమ్స్ ఎడిషన్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత అథ్లెట్‌గా నిషాద్ కుమార్ నిలిచాడు. గత ఎడిషన్‌లో అంకుర్ ధామా పరుగుల పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించగా, చేతులు లేకుండానే విలువిద్యలో అద్భుతాలు చేసిన శీతల్ దేవి కూడా రెండు బంగారు పతకాలు గెలిచింది. ఇప్పుడు నిషాద్ వారి సరసన చేరాడు. అతడి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రెండు స్వర్ణాలు గెలవడంతో పాటు రికార్డు సృష్టించడం అతడి ప్రతిభకు నిదర్శనమని అభినందించారు.
ఆరేళ్ల వయసులోనే జీవితాన్ని మార్చిన ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన నిషాద్ కుమార్ చిన్నతనంలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. కుటుంబానికి చెందిన పొలంలో గడ్డి కోసే యంత్రం తగలడంతో ఆరేళ్ల వయసులో అతడి కుడిచేయి కోల్పోయాడు. అయినా క్రీడలపై ఆసక్తిని వదులుకోలేదు. మొదట రెజ్లింగ్, అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న అతడు, తర్వాత హైజంప్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైన శిక్షణ, నిరంతర సాధనతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
పారాలింపిక్స్‌లోనూ పతకాల హీరో
నిషాద్ కుమార్ విజయాలు ఆసియా పారా గేమ్స్‌కే పరిమితం కాలేదు. టోక్యో 2020 పారాలింపిక్స్‌లో హైజంప్ T47 విభాగంలో రజత పతకం గెలిచాడు. పారిస్ 2024 పారాలింపిక్స్‌లోనూ మరో రజత పతకాన్ని సాధించాడు. ఇప్పుడు 2026 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలతో తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. చిన్ననాటి ప్రమాదం తన లక్ష్యాలకు అడ్డంకి కాదని అతడు తన విజయాలతో చాటిచెప్పాడు. వైకల్యాన్ని అధిగమించి పట్టుదలతో ముందుకు సాగితే అసాధ్యమనుకున్న లక్ష్యాలను కూడా సాధించవచ్చని నిషాద్ ప్రయాణం నిరూపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
