ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడేందుకు నకిలీ నెంబర్ ప్లేట్‌లతో వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. తాజాగా ట్రాఫిక్ జయింట్ కమిషనర్ ఆదేశాలతో నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు టప్పాచబుత్రా, ఐఎస్ సదన్ , తోలిచౌకి ,అబిడ్స్ , మలక్‌పేట ఏరియాల్లో వారం రోజుల్లో ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ నేరాలకు పాల్పడిన పలు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
HSRP నంబర్ ప్లేట్లనే వాడాలి
వాహనదారులు కేవలం ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను (HSRP) మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లపై ఫాంట్లను మార్చడం, అంకెలు సరిగ్గా కనిపించకుండా చేయడం, డిజైన్లు వేయడం, స్టిక్కర్లు అతికించడం లేదా ఎలాంటి అనధికారిక మార్పులు చేసినా అవి చట్టవిరుద్ధమని తెలిపారు.
ఉపేక్షించేది లేదు
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నకిలీ నెంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తే వారిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టప్రకారం వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతను పెంపొందించడానికి, నేరాలను అరికట్టడానికి, వాహనాల సరైన గుర్తింపు కోసం నగరవ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
