ఏనుగులు ఏదైన విషయాన్ని ఎన్నటికీ మరిచిపోవు అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది కేవలం ఒక నానుడి మాత్రమే కాదు, అక్షరాలా నిజమని సైన్స్ నిరూపిస్తోంది. భూమిపై నివసించే జంతువులలో ఏనుగులు అత్యంత అసాధారణమైన దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. దశాబ్దాల క్రితం తాము కలిసిన వ్యక్తులను, నడిచిన మార్గాలను, చివరికి మరణించిన తమ కుటుంబ సభ్యులను కూడా అవి గుర్తుంచుకోగలవు. అసలు ఏనుగులకు అంతటి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఎలా సాధ్యమవుతోంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేధస్సుకు నిదర్శనం:
ఇటీవల ఫ్రంటియర్స్ ఇన్ ఏజింగ్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఏనుగులు సామాజిక, ప్రాదేశిక, ఎపిసోడిక్ జ్ఞాపకశక్తిలో అత్యంత ప్రతిభను కనబరుస్తాయి. అవి తమ జీవితకాలంలో వందలాది ఇతర ఏనుగులను, మనుషులను, కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉన్న వలస మార్గాలను దశాబ్దాల పాటు మైండ్లో స్టోర్ చేసుకోగలవు.
మరణించిన వారిని గుర్తిస్తాయి..
పరిశోధనలలో తేలిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏనుగులు మరణించిన తమ కుటుంబ సభ్యుల దంతాలను లేదా ఎముకలను ఖచ్చితంగా గుర్తించగలవు. అడవిలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడైనా తమ వారి అస్థిపంజరాలు కనిపిస్తే.. అవి అక్కడ కాసేపు ఆగి, తమ తొండంతో వాటిని మెల్లగా తాకుతూ, నిశబ్దంగా నిలబడతాయి. మనుషుల లాగే అవి కూడా తమ వారి మరణానికి సంతాపం తెలియజేస్తాయని, శోకిస్తాయని ఇది రుజువు చేస్తోంది.
సమూహాన్ని నడిపించే గైడ్.. వృద్ధ ఏనుగుల జ్ఞానం
ఏనుగుల మందకు ఒక వృద్ధ ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. కఠినమైన కరువు కాలంలో లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ వృద్ధ ఏనుగు జ్ఞాపకశక్తి మందను కాపాడుతుంది. దశాబ్దాల క్రితం తాను చిన్నప్పుడు చూసిన నీటి వనరులను, సురక్షితమైన మేత ప్రాంతాలను అది గుర్తుంచుకుని, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు మందను విజయవంతంగా నడిపిస్తుంది. ఈ సంచిత జ్ఞానమే ఆయా సమూహాల మనుగడకు ప్రధాన ఆధారం.
మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు?
ఏనుగుల సామాజిక తెలివితేటలు చాలా ఎక్కువ. తమ మందలో తమకు సహాయం చేసిన మిత్రులెవరు, తమకు హాని తలపెట్టిన శత్రువులు ఎవరు అనేది అవి స్పష్టంగా గుర్తుంచుకుంటాయి. గత అనుభవాల ఆధారంగానే అవి తమ ప్రవర్తనను మార్చుకుంటాయి. అలాగే తమకు పూర్వం ఎదురైన ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ఆ మార్గాల్లో వెళ్లకుండా జాగ్రత్తపడతాయి.
జ్ఞాపకశక్తి కేవలం తెలివితేటలు కాదు.. అదొక వారసత్వం
శాస్త్రవేత్తల ప్రకారం.. ఏనుగులలో జ్ఞాపకశక్తి అనేది కేవలం సమాచారాన్ని దాచుకునే మెదడు సామర్థ్యం మాత్రమే కాదు.. అదొక వారసత్వం. తాము పెరిగిన వాతావరణం, తమను సాకిన తోటి ఏనుగులు, తమ మనుగడను శాసించిన ప్రమాదాలు.. వీటన్నింటి కలయికే వాటి మేధస్సు. కానీ ప్రస్తుత కాలంలో అడవులు అంతరించిపోవడం, వాటి సహజ వలస మార్గాలు దెబ్బతినడం వల్ల ఏనుగుల ఈ జ్ఞాపకశక్తి మ్యాప్లు కనుమరుగవుతున్నాయి. అందుకే ఈ మేధావులైన జీవులను రక్షించడం అంటే కేవలం వాటిని కాపాడటం మాత్రమే కాదు.. ఈ భూమిపై శతాబ్దాలుగా వస్తున్న ఒక అద్భుతమైన జ్ఞాన వారసత్వాన్ని కాపాడటమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
