వెనిగర్, నీరు: ఇంట్లో వంటగది లేదా మూలల్లో చీమలు చేరడం ఒక పెద్ద సమస్య. మార్కెట్లో దొరికే పురుగుల మందులు వాడటం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లలకు హాని కలిగే అవకాశం ఉంది. దీనికి బదులుగా వంటగదిలో దొరికే వెనిగర్‌తో ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో కలిపి ఒక స్ప్రే బాటిల్లో పోసుకోండి. చీమలు వచ్చే దారులు, కిటికీలు, తలుపుల వద్ద దీనిని స్ప్రే చేయండి. వెనిగర్ ఘాటైన వాసన చీమలకు అస్సలు పడదు.
నిమ్మరసం: చీమలు నిమ్మకాయ వాసనను భరించలేవు. చీమలు ఎక్కువగా ఉండే చోట నిమ్మరసం చల్లండి లేదా నిమ్మ తొక్కలను అక్కడ ఉంచండి. ఇది చీమలను దూరంగా ఉంచడమే కాకుండా వంటగదిలో మంచి సువాసనను ఇస్తుంది. చీమలు తిరిగే చోట నిమ్మరసం ఉంచినా లేదంటే, నిమ్మ తొక్కలను పెట్టినా వాటి వాసన చూసే శక్తి దెబ్బతిని, అవి మళ్లీ ఆ ప్రాంతానికి రావు.
దాల్చిన చెక్క, లవంగాలు: దాల్చిన చెక్క పొడిని లేదా లవంగాలను చీమలు వచ్చే రంధ్రాల వద్ద ఉంచండి. వీటిలోని ఘాటైన వాసన వల్ల చీమలు ఆ దారిలో రావు. లవంగాల నూనెను కూడా దూదిలో ముంచి ఆయా ప్రాంతాల్లో పెట్టవచ్చు. దాల్చిన చెక్క పొడి, లవంగం నూనె చీమల నివరాణలో అద్భుతంగా పనిచేస్తాయి.
మిరియాల పొడి: చక్కెర లేదా తీపి పదార్థాల దగ్గరకు చీమలు రాకుండా ఉండాలంటే, ఆ ప్రాంతం చుట్టూ మిరియాల పొడిని చల్లండి. ఇది సహజసిద్ధమైన చీమల నివారిణిగా పనిచేస్తుంది. మిరియాల ఘాటుకు చీమలు నిలువలేవు. వెంటనే అక్కడ్నుంచి పారిపోతాయి.
వీటితో పాటు ఇంటి పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. ఆహార పదార్థాల కణాలు నేలపై పడకుండా చూసుకోండి. ముఖ్యంగా చక్కెర, తేనె వంటి వస్తువుల డబ్బాలను ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి. తడి ఉన్న చోట చీమలు త్వరగా చేరుతాయి. కాబట్టి వంటగది ప్లాట్‌ఫారమ్ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. చెత్త బుట్టలను రోజూ ఖాళీ చేయడం వల్ల చీమలతో పాటు ఇతర పురుగులు రాకుండా ఉంటాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఇంటిని చీమల రహితంగా మార్చుకోవచ్చు.





