తాజావార్తలు

పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!


Australian Restaurant Terminates Italian Chef For Refusing To Put Pineapple On Pizza

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఉన్న లా కోస్టా (La Costa) అనే ఇటాలియన్ రెస్టారెంట్‌లో డేవిడ్ టాంబురెల్లా అనే చెఫ్ పనిచేసేవాడు. సంప్రదాయ ఇటాలియన్ వంటకాలకు పేరున్న ఈ రెస్టారెంట్‌లో పిజ్జాపై పైనాపిల్ వేయాలా వద్దా అనే అంశం పెద్ద వివాదానికి కారణమైంది.

ఓసారి రెస్టారెంట్‌లో భారీ ఫంక్షన్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో ఒకరు హామ్, పైనాపిల్ టాపింగ్స్‌తో కూడిన పిజ్జా కావాలని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ ఆర్డర్ చూసిన చెఫ్ డేవిడ్ మాత్రం ససేమిరా అన్నాడు. పిజ్జాపై పైనాపిల్ వేయడం తన ఇటాలియన్ సంస్కృతికి అవమానమని, అలాంటి పిజ్జాను తాను తయారు చేయలేనని తేల్చిచెప్పాడు.

ఇది మొదటిసారి కూడా కాదట! గతంలోనూ ఇలాంటి ఆర్డర్లు రెండుసార్లు వచ్చినప్పుడు డేవిడ్ తిరస్కరించినట్లు రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపించింది. దీంతో అతడి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేనేజ్‌మెంట్.. సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మే నెలలో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

రూ. 9 లక్షల ఫంక్షన్.. అయినా ఆ పిజ్జా చేయడానికి ఒప్పుకోలేదు!

ఈ వివాదంపై రెస్టారెంట్ యజమాని ఇలియట్ ఇంగ్రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ ఫంక్షన్ కోసం వచ్చిన కస్టమర్ ఏకంగా 15 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైమాటే. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న కస్టమర్ అడిగిన పిజ్జాను కూడా చెఫ్ తయారు చేయడానికి నిరాకరించాడని చెప్పారు.

తనకు కూడా హామ్, పైనాపిల్ పిజ్జా అంతగా ఇష్టమైన వంటకం కాదని ఇంగ్రామ్ అంగీకరించారు. కానీ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్ల అభిరుచులను గౌరవించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. హాస్పిటాలిటీ రంగంలో 17 ఏళ్ల అనుభవం, రెస్టారెంట్ల నిర్వహణలో పదేళ్ల అనుభవం ఉన్న తనకు.. ఎక్కడ పట్టుబట్టాలి, ఎక్కడ కస్టమర్ కోరికను మన్నించాలనే విషయం తెలుసని పేర్కొన్నారు. కస్టమర్ కోరిన వంటకాన్ని అందించడానికి రెస్టారెంట్ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగం పోవడంపై చెఫ్ ఫిర్యాదు.. కమిషన్ ఏం చెప్పిందంటే?

తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని డేవిడ్ టాంబురెల్లా సవాల్ చేశాడు. తనపై తీసుకున్న నిర్ణయం అన్యాయమంటూ ఆస్ట్రేలియాలోని ఫెయిర్ వర్క్ కమిషన్ (FWC)ను ఆశ్రయించాడు. అంతేకాదు.. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సమయంలో మెటల్ హ్యాండ్‌రైల్‌ను ఢీకొనడంతో తన కుడి చేతికి రెండు చోట్ల ఎముకలు విరిగాయని, ఆ గాయం కూడా తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి ఒక కారణమైందని ఆరోపించాడు.

అయితే అతడి ఫిర్యాదును కమిషన్ తిరస్కరించింది. కమిషనర్ జెన్నిఫర్ హంట్ పరిశీలనలో.. ఫిర్యాదు చేయాల్సిన గడువు ముగిసిన తర్వాత డేవిడ్ దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. ఆలస్యాన్ని మినహాయించడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని కూడా అతడు నిరూపించలేకపోయాడు. దీంతో అతడి అన్యాయపు తొలగింపు ఫిర్యాదుకు చుక్కెదురైంది.

పైనాపిల్ సాగుకు పేరున్న ప్రాంతంలోనే ఈ వివాదం!

ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. డేవిడ్ పనిచేసిన రెస్టారెంట్ ఉన్న క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతం పైనాపిల్ సాగుకు ప్రసిద్ధి. వాణిజ్యపరంగా పండించే పైనాపిల్స్‌లో గణనీయమైన భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అలాంటి ప్రాంతంలోనే పైనాపిల్ పిజ్జా విషయంలో ఈ వివాదం జరగడం విశేషం.

ఇక ఈ వివాదం జరిగిన లా కోస్టా రెస్టారెంట్ జులైలో మూతపడింది. మరోవైపు డేవిడ్ ప్రస్తుతం ఇంకో ఇటాలియన్ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి మెనూలో మాత్రం పైనాపిల్ టాపింగ్స్‌తో కూడిన పిజ్జాలు లేవట!

మొత్తానికి పిజ్జాపై పైనాపిల్ వేయాలా? వద్దా? అనే చిన్న విషయమే ఓ చెఫ్ ఉద్యోగం పోయేంత వరకు వెళ్లింది. ఒకవైపు ఇటాలియన్ వంటకాల సంప్రదాయం.. మరోవైపు కస్టమర్ల అభిరుచి.. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. ఇంతకీ మీరైతే పైనాపిల్ పిజ్జా తింటారా? లేక అది పిజ్జానే కాదంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *