తాజావార్తలు

హసీనా దేశం విడిచిన వీడియో పోస్ట్ .. అధికారి అనుమానాస్పద మృతి!


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాజీ వైమానిక దళ అధికారి అనుమానాస్పద రీతిలో మరణించాడు. తహసీఫ్ సౌరీ మృతదేహం ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. సౌరీని వేధించి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మాజీ అధికారి మృతదేహం నదిలో లభ్యం

బంగ్లాదేశ్ మాజీ వైమానిక దళ ఫ్లైట్ లెఫ్టినెంట్ తహసీఫ్ సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో కనిపించింది. మొదట గుర్తుతెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు జేబులో ఐఫోన్ ఆధారంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు  సుహ్రావర్ది మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. సౌరీ ఎలా మరణించాడనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

హసీనా దేశం విడిచిన వీడియోతో సంబంధమేంటి?

2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వం కూలింది. ఆ సమయంలో ఆమె సైనిక హెలికాప్టర్‌లో దేశం విడిచి ఇండియా వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోను సౌరీనే రికార్డు చేశాడని కొందరు అంటుంటే,  అతని కుటుంబ సభ్యులు ఈ వాదనను ఖండించారు. అతని సహోద్యోగి వీడియోను రికార్డు చేస్తే సౌరీ సాధారణ పౌరుడిగా దాన్ని షేర్ చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత సౌరీని నిరంతరం వేధించారని, మానసికంగా ఇబ్బందిపెట్టారని అన్నారు.

గూఢాచారి అంటూ ఆరోపణలు

సౌరీ గతంలో బంగ్లాదేశ్ వైమానిక దళంలో పనిచేశాడు. గత ఏడాది ఆగస్టులో అమర్ దేశ్ అనే వార్తాపత్రిక ఆయన భారత గూఢచార సంస్థ రా (R&AW) కోసం పనిచేస్తున్నారని ఆరోపించింది. సౌరీని విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుంది.

పోడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు

‘స్పీక్ విత్ రషీద్’ అనే పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సౌరీ బంగ్లాదేశ్ వైమానిక దళానికి సంబంధించి ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వీడియో గురించి ప్రశ్నించగా, ‘ప్రపంచంలో పైకి ఎదగాలని కోరుకునేవారు, నిజంగా ఎదగగలిగేవారు ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. మంచి లక్ష్యం కోసం ప్రాణాలు అర్పించడం కంటే గొప్పది లేదు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే గొప్ప త్యాగం మరొకటి లేదు’ అని సౌరీ అన్నారు. ఆయన మరణవార్త వెలుగులోకి రావడంతో పోడ్‌కాస్ట్ వీడియోను పలువురు ప్రస్తావిస్తున్నారు.

ఇంటికి తిరిగి రాని సౌరి

అక్టోబర్ 27న సౌరీ తల్లితో షాపింగ్‌కు వెళ్లారు. అదే రోజు సాయంత్రం స్నేహితుడితో డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:35 గంటల సమయంలో ఇంటికి వస్తున్నట్లు తల్లికి మెసేజ్ చేసారు కానీ ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు నదిలో మృతదేహం కనిపించింది. బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన పరిణామాల తర్వాత షేక్ హసీనా భారత్‌లో ఉంటున్నారు. ఆమెకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, దేశం విడిచి వెళ్లిన సమయంలోని వీడియోలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *