బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ఒకరిపై పైచేయి సాధించిన వాళ్లే.. మరుసటి రోజు అదే వ్యక్తి ముందు తలవంచాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా జరిగిన గోట్ టాస్కుల్లోనూ ఇదే జరిగింది. మొదటి నుంచి పట్టుదలతో పోరాడిన త్రిగుణ్, శివ తమ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు ముకేష్ ఆటతీరు, టాస్కుల సమయంలో చోటుచేసుకున్న పరిస్థితులు హౌస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా త్రిగుణ్ కోసం శివ తీసుకున్న నిర్ణయం ఎపిసోడ్‌కే హైలైట్ గా నిలిచింది. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన 48వ ఎపిసోడ్లో దేబ్జానీకి సంబంధించిన భావోద్వేగ సన్నివేశం కనిపించింది. గ్రీన్ లెవల్లో తన ఫొటోను చూసుకున్న ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని ఎమోషనల్ అయ్యింది. దాంతో త్రిగుణ్ ఆమెను అభినందించాడు. టాస్కుల్లో మొదటి నుంచి పట్టుదలతో ఆడుతూ, గంటల తరబడి బరువులను మోస్తూ బ్యాలెన్స్ చేయడం చిన్న విషయం కాదని ప్రశంసించాడు. అమన్, నీతూ గ్రీన్ లెవల్లో ఉండటం కూడా సంతోషంగా ఉందని చెప్పాడు. దీనికి దేబ్జానీ.. తాను మొదటి నుంచి బిగ్ బాస్‌పై, మాతాపై నమ్మకం పెట్టుకున్నానని చెప్పింది.
ఆ తర్వాత ఎల్లో లెవల్లో ఉన్న కంటెస్టెంట్లకు గ్రీన్ లెవల్లోకి వెళ్లేందుకు బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఈసారి గోట్ ఆఫ్ కామన్ సెన్స్ టాస్క్‌ను ఇచ్చాడు. స్క్రీన్‌పై అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసినవారు ముందుగా బెల్ మోగించి సమాధానం చెప్పాలి. సరైన సమాధానాలతో ఎక్కువ పాయింట్లు సాధించినవారు విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ వివరించాడు. తొలి ప్రశ్నలో తడి దూది, పొడి దూది బరువుల గురించి అడగగా.. ముకేష్ ముందుగా బెల్ మోగించినప్పటికీ తప్పు సమాధానం చెప్పాడు. మరోవైపు నరేష్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. అయితే టాస్క్ సాగుతున్న కొద్దీ పోటీదారుల మధ్య వాదనలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. బెల్ మోగించే క్రమంలో ఇతరులను అడ్డుకోవడం, తనను ఎవరైనా తాకితే అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు కనిపించాయి. ఒక దశలో ముకేష్, శివ మధ్య జరిగిన తోపులాటలో శివ తలకు బలంగా దెబ్బ తగిలింది. అయినప్పటికీ శివ్ సంయమనం పాటించాడు. ఈ ఘటనతో ఇద్దరి ఆటతీరుపై హౌస్‌లో చర్చ మొదలైంది. చివరకు ఈ టాస్క్‌లో శివ్ ఎక్కువ పాయింట్లు సాధించి గోట్ ఆఫ్ కామన్ సెన్స్‌గా నిలిచాడు. దీంతో అతడు గ్రీన్ లెవల్లోకి చేరడంతో పాటు రెండు వారాల పాటు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యే అవకాశాన్ని అందుకున్నాడు.
ఇక ఎల్లో లెవల్లో మిగిలిన కంటెస్టెంట్ల కోసం గోట్ ఆఫ్ స్పీడ్ టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో రామ్ ప్రసాద్, నరేష్, త్రిగుణ్, శివ్, వర్షిణి పోటీ పడాల్సి ఉంది. ఇద్దరు గాడ్స్‌గా, మరో ఇద్దరు దొంగలుగా మారి టాస్క్‌లో పాల్గొనాలని బిగ్ బాస్ సూచించాడు. వర్షిణి ఆటలో పాల్గొనే అంశంపై ముకేష్ ప్రత్యేకంగా స్పందించాడు. ఆమెను పక్కన పెట్టకుండా అవకాశం ఇవ్వాలని, ఒక అమ్మాయిని ఆటకు దూరంగా ఉంచడం సరైన నిర్ణయం కాదని వాదించాడు. అయితే చివరకు రామ్ ప్రసాద్, నరేష్ ఒక జట్టుగా, త్రిగుణ్, శివ మరో జట్టుగా టాస్క్‌లోకి దిగారు. గోట్ ఆఫ్ స్పీడ్ టాస్క్‌లో త్రిగుణ్, శివ్ లు గట్టి పోటీ ఇచ్చారు. సంచాలకుడిగా వ్యవహరించిన సుధీర్ నిర్ణయాలపై కూడా కొన్ని సందర్భాల్లో చర్చ జరిగింది. మరోవైపు శివ్ కాలికి గాయం అయినప్పటికీ ఆటను మధ్యలో వదిలిపెట్టకుండా పోరాటాన్ని కొనసాగించాడు. చివరకు త్రిగుణ్, శివ్ జోడీ విజయం సాధించింది. అయితే వీరిద్దరిలో ఒక్కరికి మాత్రమే గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశం ఉందని బిగ్ బాస్ ప్రకటించడంతో అసలు కథ మొదలైంది. ఇద్దరూ కలిసి కష్టపడి గెలిచినప్పటికీ.. ఆ విజయాన్ని ఎవరు సొంతం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కీలక సమయంలో త్రిగుణ్ తన మాటలతో శివ్ ను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని, ఈసారి తనను గ్రీన్ లెవల్లోకి వెళ్లనివ్వాలని కోరాడు. సాధారణంగా ఎవరి ముందు చేతులు చాచే వ్యక్తిని కాదని చెబుతూనే..శివ్ ను అభ్యర్థించాడు. త్రిగుణ్ మాటలకు శివ్ కూడా భావోద్వేగంగా స్పందించాడు. గతంలో తనను మోసం చేశాడనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈసారి త్రిగుణ్ తనను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డాడని గుర్తుచేశాడు. గతంలో త్రిగుణ్‌ను మోసపోయిన వ్యక్తిగా, తనను మోసం చేసిన వ్యక్తిగా కొందరు చిత్రీకరించారని చెప్పాడు. అలాగే వైల్డ్ ఫైర్‌గా హౌస్‌లోకి వచ్చిన తనను వైల్డ్ ఫూల్ అంటూ విమర్శించిన సందర్భాలను కూడా ప్రస్తావించాడు. అయితే ఇప్పుడు అదే త్రిగుణ్‌తో కలిసి టాస్క్ ఆడి విజయం సాధించానని, అతడు తనను ఒప్పించేందుకు నిజాయితీగా ప్రయత్నించాడని శివ చెప్పాడు. టాస్క్‌లో త్రిగుణ్ పడిన కష్టాన్ని గుర్తించి, అతడే గోట్ బిగ్ బాస్‌గా నిలవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో త్రిగుణ్‌కు అవకాశం కల్పిస్తూ శివ్ వెనక్కి తగ్గాడు. శివ్ తీసుకున్న నిర్ణయంతో త్రిగుణ్ గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచాడు. తన కోసం శివ్ తీసుకున్న నిర్ణయానికి భావోద్వేగానికి గురైన త్రిగుణ్.. అతడిని గట్టిగా హత్తుకున్నాడు. అనంతరం ఇద్దరూ చేతులు పైకెత్తి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గతంలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, టాస్క్ సమయంలో కలిసి పోరాడి చివరకు ఒకరికి మరొకరు అండగా నిలవడం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా మారింది. ఈ విజయంతో త్రిగుణ్‌కు ఈ వారం మాత్రమే కాకుండా వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో అతడి గ్రీన్ లెవల్ ప్రయాణం మరింత బలపడింది. మరోవైపు శివ్ కు గ్రీన్ లెవల్లోకి వెళ్లే అవకాశం దక్కకపోయినా, త్రిగుణ్ కోసం అతడు తీసుకున్న నిర్ణయం ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
