
మానవ-వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనే దిశగా మహారాష్ట్ర అటవీ శాఖ చారిత్రక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అడవిలో సంచరించే రెండు ఆడ చిరుతపులులకు ఇమ్యునో-కాంట్రాసెప్టివ్ టీకా వేసి, తిరిగి అడవిలోకి సురక్షితంగా విడిచిపెట్టింది. జున్నార్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ పరిశోధనకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుండి వన్యప్రాణి చట్టం-1972 కింద ముందస్తు అనుమతులు లభించాయి. ఈ పైలట్ అధ్యయనాన్ని మహారాష్ట్ర అటవీ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్, అలాగే వన్యప్రాణి రక్షణ సంస్థ టీమ్ రెస్క్యూ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టీకా వేసిన తర్వాత చిరుతల శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల మార్పులు, వ్యాక్సిన్ పనితీరును అంచనా వేసేందుకు ICMR పరిశోధకులు ఎప్పటికప్పుడు రక్త నమూనాలను విశ్లేషిస్తున్నారు. అటవీ క్షేత్రస్థాయి సిబ్బంది, వెటర్నరీ నిపుణుల పర్యవేక్షణలో ఆ చిరుతల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
అవసరం ఎందుకొచ్చింది?
మహారాష్ట్రలోని జున్నార్ డివిజన్లో చెరకు తోటలు విస్తారంగా ఉండటంతో చిరుతలు వాటిని ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు, పశువులపై దాడులు తరచూ జరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా చిరుతలను బంధించి జూలలో ఉంచడం కంటే వాటి జనాభాను క్రమబద్ధీకరించడమే శాశ్వత పరిష్కారమని నిపుణులు భావించారు. ఈ క్రమంలోనే గర్భనిరోధక పద్ధతుల ద్వారా సంతానోత్పత్తిని నియంత్రించే ప్రయత్నం మొదలైంది.
నిపుణుల స్పందన – విశ్లేషణ
‘‘జనావాసాల మధ్య చిరుతల సంఖ్యను మానవీయ కోణంలో నియంత్రించేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ తీసుకున్న గొప్ప ముందడుగు ఇది. ఈ ఇమ్యునో-కాంట్రాసెప్షన్ ప్రభావం తాత్కాలికంగా మాత్రమే ఉన్నప్పటికీ, దేశంలోనే చిరుతలకు సంబంధించి చేపట్టిన తొలి పరిశోధన కాబట్టి దీని ఫలితాలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని కార్బెట్ ఫౌండేషన్ డైరెక్టర్ కేదార్ గోరే తెలిపారు. ‘‘రక్షిత అటవీ ప్రాంతాల వెలుపల వన్యప్రాణులు సంచరిస్తున్నప్పుడు ఇలాంటి శాస్త్రీయ పరిష్కారాలే అత్యంత కీలకం. ఈ వ్యాక్సిన్ వల్ల చిరుతల స్వభావం, వాటి సరిహద్దు ప్రవర్తన, దూకుడుతనం, వేటాడే పద్ధతుల్లో ఏమైనా మార్పులు వస్తాయా అనేది తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం’’ రావ్
వ్యవస్థాపకుడు పవన్ శర్మ వివరించారు.
ప్రాజెక్ట్ వెనుక ఉన్న కీలక అధికారులు
మహారాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ రవికిరణ్ గోవేకర్, పుణె చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆశిష్ ఠాక్రే, ముంబై చీఫ్ కన్జర్వేటర్ జితేంద్ర రామ్గావ్కర్, మరియు నిపుణుడు డాక్టర్ శాంతిభూషణ్ ఝా ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మానవ-చిరుతల సంఘర్షణలు ఎక్కువగా ఉండే అనేక రాష్ట్రాల్లో చిరుతలను చంపకుండా లేదా బోన్లలో బంధించకుండా, సహజ సిద్ధంగానే వాటి సంతతిని నియంత్రించే సరికొత్త మార్గం సుగమం కానుంది.
