Denza D9.
కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణాలు చేయాలనుకునే లగ్జరీ కారు ప్రియులను ఆకట్టుకునేలా Denza D9 సిద్ధమవుతోంది. భారీ బ్యాటరీ, ప్రీమియం కెప్టెన్ సీట్లు, పెద్ద డిస్ప్లేలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ MPV ప్రత్యేకతలు. భారత్‌లో దీని ధర ఎంత ఉండొచ్చు? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి?
లగ్జరీ డిజైన్..
BYD ఆధ్వర్యంలోని Denza బ్రాండ్‌కు చెందిన D9 ఐదు మీటర్లకు పైగా పొడవుతో ఉండే లగ్జరీ MPV. ముందు భాగంలో భారీ గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లైడింగ్ రియర్ డోర్లు ఉండగా, వెనుకవైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
Denza D9లో ఏడు సీట్ల లేఅవుట్ ఉండనుంది. రెండో వరుసలో లాంజ్ తరహా కెప్టెన్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పవర్డ్ ఒట్టోమన్, రిక్లైనింగ్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు గ్లోబల్ మోడల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. లెదరెట్ అప్హోల్స్టరీ, వుడెన్ ఫినిషింగ్, యాంబియంట్ లైటింగ్ క్యాబిన్‌కు మరింత విలాసవంతమైన రూపాన్ని అందిస్తాయి.
ఫీచర్ల విషయానికి వస్తే.. గ్లోబల్ మోడల్లో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12-అంగుళాల AR హెడ్అప్ డిస్ప్లే, 14-స్పీకర్ Dynaudio ఆడియో సిస్టమ్ ఉన్నాయి. మూడు వైర్లెస్ ఛార్జర్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే, భారత్‌లో విడుదలయ్యే వెర్షన్లో ఫీచర్ల జాబితా మారవచ్చు.
103kWh బ్యాటరీ..
Denza D9లో 103kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. FWD, AWD ఆప్షన్లను బట్టి 313PS నుంచి 373PS వరకు పవర్ లభిస్తుంది. వెర్షన్‌ను బట్టి 580–600 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ NEDC రేంజ్ అందిస్తుంది. భారత్‌లోని మోడల్‌కు సంబంధించిన బ్యాటరీ, పవర్, రేంజ్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
భద్రత కోసం గ్లోబల్ మోడల్లో ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో Denza D9 ధర రూ.80 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. నవంబర్ 2026లో విడుదలైతే MG M9, Toyota Vellfire వంటి లగ్జరీ MPVలకు పోటీ ఇవ్వనుంది.
