తాజావార్తలు

దసరా రోజున సంబరాలుండవు.. రావణాసురుడికి ప్రత్యేక పూజలు..మనదేశంలోనే ఇదో విచిత్ర ఆచారం!


విజయదశమి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది దసరా సంబరాలు, రాముడి విజయం, దహనమయ్యే రావణుడి భారీ ఆకృతులు. దేశంలోని మూలమూలలా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఉన్న బిస్రఖ్ గ్రామంలో మాత్రం ఈ పండుగ రోజున వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పండుగ ఉత్సాహానికి బదులుగా శోకం కనిపిస్తుంది.

రావణాసురుడి జన్మస్థలం బిస్రఖ్

పౌరాణిక కథనాలు, శివపురాణ ప్రశంసల ప్రకారం.. బిస్రఖ్ గ్రామం రావణాసురుడి జన్మభూమిగా పరిగణించబడుతుంది. రావణుడి తండ్రి అయిన విశ్రవ మహర్షి పేరు మీదుగా ఈ గ్రామానికి మొదట్లో విశ్వేశర అని, కాలక్రమేణా బిస్రఖ్ అని పేరు వచ్చింది. ఈ గ్రామంలోనే విశ్రవ మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశారని, రావణాసురుడు కూడా తన బాల్యంలో ఇక్కడే శివుడిని ఆరాధించాడని స్థానికులు నమ్ముతారు.

రావణుడి దహనం ఉండదు.. సంతాపం మాత్రమే!

బిస్రఖ్ గ్రామస్తులు రావణాసురుడిని ఒక రాక్షసుడిగా కాకుండా మహా వేద పండితుడిగా, శివభక్తుడిగా, తమ గ్రామ పూర్వీకుడిగా భావిస్తారు. దసరా రోజున రాముడి చేతిలో రావణ సంహారం జరిగిందనే కారణంతో ఇక్కడి ప్రజలు ఆ రోజును ఒక శోక దినంగా పాటిస్తారు. అందుకే ఈ గ్రామంలో పొరపాటున కూడా రామ్ లీలా నాటకాలు వేయరు, రావణుడి బొమ్మలను తగలబెట్టరు. ఒకవేళ ఎవరైనా రావణ దహనం చేయడానికి ప్రయత్నిస్తే ఆ ఊరికి అశుభం జరుగుతుందనే బలమైన నమ్మకం ఇక్కడి ప్రజల్లో ఉంది.

ఇవి కూడా చదవండి



యజ్ఞాలు, ప్రత్యేక ఆరాధన

దసరా రోజున ఈ ఊరిలోని పురాతన రావణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. యజ్ఞశాల ముందు రావణాసురుడి విగ్రహాన్ని ఉంచి గ్రామస్థులంతా కలిసి హవనాలు నిర్వహిస్తారు. రావణుడితో పాటు ప్రతినిత్యం భగవంతుడైన శ్రీరాముడిని, శివుడిని, బ్రహ్మదేవుడిని కూడా ఈ ఆలయంలో ఆరాధించడం విశేషం. సోషల్ మీడియా, ఇంటర్నెట్ పుణ్యమా అని బిస్రఖ్ గ్రామం ఈ విచిత్రమైన సంప్రదాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం దసరా సమయంలో దేశం నలుమూలల నుంచి అనేకమంది పర్యాటకులు, పరిశోధకులు ఈ విచిత్ర సంప్రదాయాన్ని, ఇక్కడి రావణుడి ఆలయాన్ని సందర్శించడానికి తరలివస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *