తాజావార్తలు

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు.. భద్రాచలానికి తరలింపు..


ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సుక్మా జిల్లాలోని కొంటా రేంజ్ పరిధిలోని వివిధ సీఆర్పీఎఫ్ క్యాంపులలో గతంలో స్వాధీనం చేసుకున్న, ఉపయోగించని పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేసేందుకు జగదల్‌పూర్ నుంచి 50వ బెటాలియన్ సీఆర్పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక అమ్యూనిషన్ టెక్నీషియన్ టీమ్ ఎలార్మడుగు క్యాంపునకు చేరుకుంది. అక్టోబర్ 8న క్యాంపునకు సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బోదరాజ్‌పదర్ వాగు సమీపంలో టెక్నీషియన్ బృందం ఐఈడీలను డిస్పోజ్ చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో సాంకేతిక లోపమో లేదా ప్రమాదవశాత్తూనో ఐఈడీ ఒక్కసారిగా పేలిపోయింది.

నలుగురు జవాన్లకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఏఎస్ఐ ఎం.కె. తివారీ, ఏఎస్ఐ అనీష్ ఖాన్‌‌లకు తీవ్ర గాయాలపాలవ్వగా.. ఇన్‌స్పెక్టర్ అమర్‌నాథ్ మిశ్రా, హెడ్ కానిస్టేబుల్ కుల్దీప్ రాజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

భద్రాచలానికి తరలింపు.. చికిత్స ముమ్మరం

పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఇతర బలగాలు క్షతగాత్రులను రక్షించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన కొంటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావమై, పరిస్థితి విషమంగా మారిన ఏఎస్ఐ తివారీ, ఏఎస్ఐ అనీష్ ఖాన్‌లను మెరుగైన అత్యవసర వైద్యం కోసం సరిహద్దు దాటించి తెలంగాణలోని భద్రాచలంలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పేలుడుకు గల ఖచ్చితమైన సాంకేతిక కారణాలపై అంతర్గత విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *